ఓటీటీల్లోకి కొత్త మలయాళ సినిమాలు ఎప్పుడొస్తాయా అని తెలుగు ఆడియెన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం డబ్బింగ్ రూపంలో పలు మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. ఈ వీకెండ్ అలా వచ్చిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'భరతనాట్యం 2 మోహినియాట్టం'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
కథేంటి?
శశి(సైజు కురుప్) తండ్రి భరతన్(సాయి కుమార్) చనిపోవడం దగ్గర 'భరతనాట్యం' తొలి భాగం ఆగింది. అక్కడి నుంచి ఈ సీక్వెల్ మొదలైంది. శశి తన కుటుంబంతో కలిసి సవతి తల్లి రుక్మిణిని సొంతూరులో దిగబెట్టేందుకు వస్తాడు. ఓ వారం రోజుల పాటు వీళ్లంతా ఆ ఊరిలోనే ఉండాల్సి వస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తి చనిపోవడానికి శశి కుటుంబం కారణమవుతుంది. మరి ఈ హత్య నుంచి శశి ఫ్యామిలీ బయటపడిందా? లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
'భరతనాట్యం 2 మోహినియాట్టం'.. ఈ పేరు చూసి ఇదేదో డ్యాన్స్‌కి సంబంధించిన సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇదో డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. మీరు 'దృశ్యం' చూసే ఉంటారుగా. ఇది దాని స్ఫూప్‌లా అనిపిస్తుంది. కాకపోతే అది పూర్తి సీరియస్. ఇందులో మాత్రం సరదాగా సాగిపోయే కామెడీతో బాగా నవ్వించారు.
2024లో రిలీజైన 'భరతనాట్యం' ఓ ఫ్యామిలీ డ్రామా. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫ్లాప్ అయింది. ఓటీటీలోనూ ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. అయినా సరే లీడ్ రోల్ చేసిన సైజు కురుప్ నిర్మాతల్లో ఒకడు కావడంతో సీక్వెల్ తీశారు. గత నెలలో రిలీజ్ చేశారు. రూ.5 కోట్లు పెట్టి తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అలా అని ఇదేదో కొత్త స్టోరీ అంటే కాదు. తెలుగు క్రైమ్ మూవీస్‌లో కనిపించిన కథే. కాకపోతే స్క్రీన్ ప్లే, స్టోరీని డీల్ చేసిన విధానం, సిట్యుయేషనల్ కామెడీ వర్కౌట్ అయ్యాయి.
సినిమా ప్రారంభంలో మొదటి పార్ట్‌లో ఏం జరిగిందో సింపుల్‌గా చూపించేశారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వస్తాం. శశి ఫ్యామిలీ వేరే ఊరికి వస్తారు. ఇక్కడ వీళ్లకు గోవింద్ అనే పెద్దమనిషి రూపంలో సమస్య ఎదురవుతుంది. అతడిని శశి కుటుంబం ఎలా డీల్ చేసిందనేది మిగతా స్టోరీ. మూవీ మొదలైన 20 నిమిషాలు బోర్ కొడుతుంది. ఎప్పుడైతే గోవింద్ పాత్ర ఎంటర్ అవుతుందో స్టోరీలో కదలిక వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అటు థ్రిల్, ఇటు కామెడీ బాగా పండాయి. ఊహించని విధంగా క్లైమాక్స్ పడుతుంది.
ఇందులో సూపర్, హిలేరియస్ కామెడీ ఉందని చెప్పాం గానీ పర్లేదు ఓ సారి చూడొచ్చనేలా ఉంది. మరి రెండో పార్ట్ చూడాలంటే తొలి పార్ట్ చూడాలా అంటే కుదిరితే చూడండి. లేకపోయినా సరే స్టోరీ దాదాపుగా అర్థమైపోతుంది. ఇలా అన్నీ ప్లస్సులేనా అంటే మైనస్సులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి మర్డర్ చేసినా సరే పోలీసులు పట్టుకోలేరా? అనే డౌట్స్ వస్తే మాత్రం కామెడీని ఎంజాయ్ చేయలేరు. మలయాళ చిత్రాల్లోని సాగదీత ఉండనే ఉంది.
ఎవరెలా చేశారు?
శశి పాత్రలో నటించిన సైజు కురుప్ సహా మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కారు. అయినా సరే ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటి సాంకేతిక అంశాలు కూడా చక్కగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. పేరుకే డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ ఫ్యామిలీతోనూ కలిసి చూడొచ్చు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)


