
బండి సరోజ్ కుమార్.. ఈ తరం ఆడియెన్స్‌కి ఈ పేరు కాస్తోకూస్తో తెలుసు. అది కూడా ఇతడు హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన నిర్బంధం, నిర్బంధం 2 సినిమాలు వల్ల. వీటిని యూట్యూబ్‌లోనే రిలీజ్ చేశాడు. వాటికి వచ్చిన వ్యూస్ ద్వారానే ఇతడికి డబ్బులొచ్చాయి. సరోజ్ కుమార్ తొలిసారి నటించిన కమర్షియల్ మూవీ 'మోగ్లీ'. యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా చేశాడు. రీసెంట్‌గానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సరోజ్ కుమార్ చేసిన విలన్ క్యారెక్టర్‌కి ప్రశంసలు చాలా వస్తున్నాయి. అయితే మూవీ టీమ్ మాత్రం వాటిని డిలీట్ చేస్తూ, తనకు అన్యాయం చేస్తోందని, తన కెరీర్, భవిష్యత్తు గురించి భయమేస్తోందని సరోజ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశాడు. మూవీ టీమ్‌తో వివాదం గురించి మొత్తం బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. తెలుగు దర్శకుడి ఆవేదన)
ఇంతకీ అసలేమైంది?
'మోగ్లీ' గ్లింప్స్‌లో తనని మెచ్చుకుంటూ పెడుతున్న కామెంట్స్‌ని మూవీ టీమ్ డిలీట్ చేస్తోందని బండి సరోజ్ కుమార్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ నా గురించి పెట్టిన 400కి పైగా కామెంట్స్ తొలగించారు. ఇంకా అదే పనిలో ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ దీన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది కంటెంట్ ఫిల్మ్ అని, లాంచ్ ప్యాడ్ ఫిల్మ్ కాదని నాకు చెప్పారు. అందుకే నేను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను. నా సర్వస్వం పెట్టాను. ఎలాంటి కండీషన్స్ లేకుండా పనిచేశాను. కానీ నాకు దక్కిన ఫలితం ఇదే. దీని వెనక ఓ సిండికేట్ ఉంది. ఇది ఆమోదయోగ్యమైనదేనా?' అని సరోజ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
'కామెంట్స్ ఏ కదా.. లైట్ తీసుకోమని చెప్పేవాళ్లకి. నేను ఇప్పటివరకు బయట సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక, నా పాత్ర నచ్చి అందులో ఎలాంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్‌తో ఈ సినిమాలో పారితోషికం లేకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలలు నా సమయాన్ని ఇచ్చాను. నాకు వస్తున్న రిసెప్షన్ చూసి ముందు థంబ్ నెయిల్స్ మార్చారు. తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను దర్శకుడితో మాట్లాడాక మళ్లీ ఆన్ చేశారు. ఒక మూడు కామెంట్లని 3 బాట్ లైక్స్‌తో బూస్ట్ చేసి, నా పాత్రకి వస్తున్న ఆదరణని మ్యాచ్ చేయడానికి చూశారు. కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్స్ డిలీట్ చేశారు. ఇంకా డిటైల్డ్ ప్రూఫ్స్‌తో ముందుకు వస్తాను'
'ఇప్పటికీ అక్కడున్న 1600 కామెంట్లలో 99 శాతం నాపైన ప్రేక్షకుడు పలికించిన ప్రేమే. నాకు పీఆర్‌లు లేరు. ప్రేక్షకుడి బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవ్వడూ ఆపలేరు. వీళ్లు ఇప్పుడు ఇలా చేస్తే, రేపు సినిమాలో ఎన్ని చేస్తారు. ఎవరిని నమ్మాలి. నిర్మాత వరకు వెళ్లే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్‌సెక్యూర్ నెపోటిజం, పాలిటిక్స్‌ని అస్సలు సహించను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది మీ ప్రమేయం లేకుండా జరుగుతుందని అనుకుంటున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చౌకబారు నెపోటిజంకి అడ్డాగా మారకూడదు. దీని వల్ల నా బాధ, నా భవిష్యత్తు కెరీర్ పట్ల ఉన్న భయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని సరోజ్ కుమార్ ట్వీట్ చేశాడు.
అయితే సరోజ్ కుమార్ ట్విటర్ అకౌంట్ ప్రస్తుతం కనిపించట్లేదు. కానీ ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇతడికి మద్ధతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అలానే ఇతడు చెప్పినట్లు గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు థంబ్ నెయిల్‌లో ఇతడి ఫొటో కనిపించింది. ఇప్పుడేమో హీరోహీరోయిన్ పెట్టి, అతడి ఫొటోని తొలగించారు. మరోవైపు సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయముంది. ఇప్పుడు ఈ గొడవ చూస్తుంటే.. ముందు ముందు ఇంకెంత రచ్చ అవతుందో అనే సందేహం కలుగుతోంది.
(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు)

