AKA: గీతాచిత్రలహరి

AKA Wins Big at International Documentary and Short Film Festival - Sakshi

బాలీవుడ్‌ అనే మహా సముద్రంలో ప్రతి అల అరుదైన అనుభవాలు, జ్ఞాపకాలను మోసుకు వస్తుంది. వాటిని అందుకునే వారు అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవకు చెందిన రైటర్, ఎడిటర్, డైరెక్టర్‌ గీతికా నారంగ్‌ అబ్బాసి కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ డాక్యుమెంటరీ అండ్‌ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో బెస్ట్‌ లాంగ్‌ డాక్యుమెంటరీ అవార్డ్‌ గెలుచుకుంది...

నార్త్‌ దిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గీతికా నారంగ్‌ అబ్బాసికి బాల్యంలో ఏకైక వినోద మాధ్యమం సినిమా. కాస్త చమత్కారంగా చెప్పాలంటే, ఆమె బాల్యజీవితంలో బాల్య జ్ఞాపకాల కంటే బాలీవుడ్‌ సినిమాలే ఎక్కువ!
తండ్రి నారంగ్‌ అబ్బాసి బిమల్‌రాయ్, గురుదత్, రాజ్‌కపూర్‌ల గురించి చెప్పడమే కాదు వారి సినిమాలు చూపించేవాడు. చిన్నప్పుడు గీతికకు ఇష్టమైన కథానాయకుడు రాజ్‌కపూర్‌. గీతిక మాటల్లో చెప్పాలంటే రాజ్‌కపూర్‌ తన హావభావాలతో గ్రేట్‌ చార్లి చాప్లిన్‌ను తనకు పరిచయం చేశాడు.

చార్లి చాప్లిన్‌ సినిమాలు చూసి...
‘ఈయన రాజ్‌కపూర్‌ను బాగా కాపీ కొడుతున్నాడు’ అని అమాయకంగా అనుకునే రోజులవి!
దిల్లీలోని హిందూ కాలేజి నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది గీతిక. ఆ తరువాత ఎడ్వర్‌టైజింగ్‌లో పీజి చేసింది. అయితే ఆ చదువేమి తనకు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఒక సాయంత్రం కాఫీ సేవిస్తూ...
‘నాట్‌ మై కప్‌ ఆఫ్‌ టీ’ అనుకుంది ప్రకటనల రంగం గురించి.
దిల్లీలోని ఒక ఫిల్మ్‌ప్రొడక్షన్‌ కంపెనీలో చేరడంతో ఫిల్మ్‌ మేకింగ్‌పై తనకు అవగాహన ఏర్పడింది. కొన్ని డాక్యుమెంటరీలకు సహాయకురాలిగా పనిచేసింది.

‘హాలీవుడ్‌తో పోల్చితే మన దగ్గర డాక్యుమెంటరీల సంఖ్య చాలా తక్కువ. ఎందుకు ఇలా!’ అనుకునేది చాలాసార్లు. ఆ లోటును తనవంతుగా భర్తీ  చేయడానికి అన్నట్లుగా తొలిసారిగా ‘గుడ్‌నైట్‌’ పేరుతో మొదటి సారిగా షార్ట్‌ డాక్యుమెంటరీ తీసింది.
నాన్న తనకు సినిమాలకు సంబంధించిన విశేషాలు చెబుతుండేవాడు. ఉదా: ఫలానా సినిమాలో నృత్య బృందంలో కనిపించే అమ్మాయి ఆ తరువాత పెద్ద హీరోయిన్‌ అయింది...ఈ సినిమా పేరు చెప్పగానే ఆ హీరో నటవిశ్వరూపం గుర్తుకువస్తుందిగానీ, నిజానికి ఆ సినిమా కథ వేరొక హీరో కోసం తయారు చేసింది. ఆ హీరోకి నచ్చకపోవడంతో ఈ హీరోకి అవకాశం వచ్చి ఎక్కడికో తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో గీతికకు అనిపించింది ఏమిటంటే...
‘మన సినిమాల పైనే వివిధ కోణాల్లో డాక్యుమెంటరీలు తీస్తే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కదా!’
విడుదలకు నోచుకోని ‘అమీర్‌ సల్మాన్‌ షారుఖ్‌’ ఫీచర్‌ ఫిల్మ్‌ నుంచి ‘అచ్చం ఫలానా హీరోలాగే ఉంటాను’ అని మురిసిపోయే జూనియర్‌ ఆర్టిస్ట్‌ల వరకు ఎన్నో విషయాలను తన డాక్యుమెంటరీలలోకి తీసుకువచ్చింది గీతిక. ఫిరోజ్‌ ఖాన్‌ను ‘మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేక్షకులు నవ్వితే మీ స్పందన ఏమిటి?’ అని అడిగిందట.
‘ఆర్టిస్ట్‌లో హీరోయే కాదు జోకర్‌ కూడా ఉంటాడు’ అని హాయిగా నవ్వాడట ఫిరోజ్‌. ఇలా హాయిగా నవ్వే వాళ్లతో పాటు ‘అది నిన్నటి అభిప్రాయం మాత్రమే. ఈరోజు నా అభిప్రాయం మార్చుకున్నాను’ అని ఏ అభిప్రాయం మీద నిలకడలేని నటులతో చిత్రమైన అనుభవాలు ఎదుర్కొవలసి వచ్చింది గీతిక.
నాటి ‘గుడ్‌నైట్‌’ నుంచి నేటి ‘ఏ.కె.ఏ’ వరకు రైటర్, ఎడిటర్, డైరెక్టర్‌గా గీతిక ఎన్నో విషయాలు నేర్చుకుంది. తనను తాను మెరుగుపరుచుకుంది.

ఇటీవల కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ డాక్యుమెంటరీ అండ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో గీతిక నారంగ్‌ తీసిన ‘ఏ.కె.ఏ’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించడమే కాదు ‘బెస్ట్‌ లాంగ్‌ డాక్యుమెంటరీ అవార్డ్‌’ను గెలుచుకుంది.
బాలీవుడ్‌ కథానాయకులు దేవానంద్, అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ఖాన్‌లను పోలి ఉండే ముగ్గురు వ్యక్తులపై తీసిన డాక్యుమెంటరీ ఇది. మిమిక్రీ నుంచి స్టార్‌డమ్‌ వరకు చిత్రరంగానికి సంబంధించి అన్ని కోణాలు ఇందులో కనిపిస్తాయి. ‘నా డాక్యుమెంటరీల లక్ష్యం నవ్వించడం కాదు, సీరియస్‌గా ఆలోచింపజేయడం’ అంటుంది గీతికా నారంగ్‌. అలా అని నవ్వకుండా ఉండలేము, అలా అని సీరియస్‌గా ఆలోచించకుండా ఉండలేము. అదే కదా ఆమె డాక్యుమెంటరీల ప్రత్యేకత!                       

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top