
ప్రముఖ కోలీవుడ్ నటుడు రోబో శంకర్(46) కన్నుమూశారు. రెండ్రోజుల కిందట హఠాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీంతో తమిళ చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
శంకర్ తొలినాళ్లలో రోబో డ్యాన్సులకు ఫేమస్. అలా ఆయన పేరు రోబో శంకర్‌గా మారింది. స్టేజ్ షోలతో చలన చిత్ర రంగానికి, అటుపై సిల్వర్ స్క్రీన్‌కు చేరారీయన. ఆయన తొలి చిత్రం ధర్మ చక్రం(1997). అయితే, ఈ చిత్రంలో ఆయన పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. విజయ్ సేతుపతి ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారా" (2013) చిత్రంతో ఆయనకు గుర్తింపు దక్కింది. ధనుష్ మారితో ఆయనకు పాపులారిటీ దక్కింది. విశాల్ ఇరుంబు తిరై (2018), అజిత్ విశ్వాసం (2019), విశాల్ చక్ర (2021), విక్రమ్ కోబ్రా (2022), కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించారు.
అయితే కామెర్లతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించారు. ఈ క్రమంలోనే ఆయన బరువు తగ్గడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో.. ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రోబో శంకర్ సడెన్‌గా స్పృహతప్పి పడిపోయారు. దీంతో చిత్ర యూనిట్ వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. వైద్యులు రెండురోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఈ గురువారం రాత్రి ఆయన మరణించారు. జీర్ణాశయంలో రక్తస్రావం, అంతర్గతంగా అవయవాలు చెడిపోవడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. గతేడాది తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించిన విషయం తెలిసిందే. విజయ్ బిగిల్ చిత్రంలో ‘గుండమ్మ’గా అలరించిన నటి ఇంద్రజ ఈయన కూతురే. రోబో శంకర్ భార్య సింగర్, నటి కూడా.

రోబో శంకర్ హఠాన్మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నటుడు ధనుష్ రోబో శంకర్ ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.
மிட்நைட்னு கூட பாக்காம உடனே போய் ஆறுதல் குடுக்க போய்ட்டாரு மனுஷன்🥺#Rip #RoboShankar 💔 pic.twitter.com/T1NDN70Dhn
— Kokki Trolls (@Kokki_Trolls) September 18, 2025