మెదక్ అర్బన్: ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శతశాతం ఫలితాలు సాధించిన సర్కారు బడుల సంఖ్య పెరిగింది. మొత్తం 126 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, అందులో 101 ప్రభుత్వ, 25 ప్రైవేట్ పాఠశాలలు ఉండటం గమనార్హం. మూడు మండలాలు శత శాతం ఫలితాలు సాధించి సత్తా చాటాయి. కాగా జిల్లావ్యాప్తంగా ఫలితాలను నిరుడితో పోలిస్తే కేవలం 0.24 శాతం తక్కువతో ఏకంగా 22వ స్థానానికి పడిపోయింది. అయితే శాతం ఫలితాల్లో మెరుగ్గా ఉండటం ఊరట కలిగించే అంశం.
శత శాతం పాఠశాలలు ఇవే..
జిల్లాలో 225 పాఠశాలలుండగా 4 బీసీ వెల్ఫేర్, 9 కేజీబీవీ, 4 మోడల్, 1 రెసిడెన్షియల్, 1 మినీ రెసిడెన్షియల్, 2, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, 3 ట్రైబల్ వెల్ఫేర్, 77 జెడ్పీ పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. అయితే అల్లాదుర్గం, నిజాంపేట, వెల్దుర్తి మండలాలు వంద శా తం ఫలితాలు సాధించగా, నర్సాపూర్ మండలం 86.91 శాతంతో చివరన నిలిచింది. గతేడాది 60 జెడ్పీ పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, ఈసారి 77కు పెరగడం శుభ పరిణామం. గతేడాది 28 ప్రైవేట్ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించగా, ఈసారి 25కు తగ్గాయి. కాగా మేనేజ్‌మెంట్‌ల వారీగా చూస్తే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 99.28 శాతం ఫలితాలతో టాప్‌లో ఉండగా, ఆశ్రమ పాఠశాలలు 72.73 శాతంతో చివరన నిలిచాయి. మొత్తం మీద జిల్లాలో 11,232 మంది పరీక్షలు రాయగా, 10,853 మంది పాసయ్యారు.


