రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

రోడ్ల అభివృద్ధికి రూ.300 కోట్లు

మంత్రి వివేక్‌

పటాన్‌చెరు: పటాన్‌చెరులో రోడ్ల అభివృద్దికి రూ.300 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి వివేక్‌ తెలిపారు. పటాన్‌చెరులో ఆదివారం జరిగిన మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు.

రైతులను ఆదుకోండి

ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలలో తలెత్తిన అనిశ్చితిని తొలగించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. సింగూరు నుంచి నీరు విడుదల చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, మంజీరా డ్యాం అధికారులకు సరైన ఆదేశాలు లేనందున క్షేత్రస్థాయిలో నీటి విడుదల జరగలేదన్నారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో సైతం ప్రస్తావించానని గుర్తు చేశారు. మంత్రి మౌఖిక ఆదేశాల ఇచ్చినా, అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులకు సాగు నీరు అందక నష్టం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే 30 శాతం పంటలు ఎండిపోయాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఘనపూర్‌ ఆనకట్టకు నీటిని విడుదల చేయకపోతే సుమారు 60 వేల ఎకరాల్లోని వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని కోరారు.

అక్రమాలకు పాల్పడితే

కఠిన చర్యలు

నర్సాపూర్‌: బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ హెచ్చరించారు. ఆదివారం ఆయన పట్టణంలోని రేషన్‌ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. రేషన్‌కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. పీడీఎస్‌ బియ్యంలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ చేస్తారని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

అసమానతలకు

వ్యతిరేకంగా పోరాటం

మెదక్‌ కలెక్టరేట్‌: సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో ‘రాజ్యాంగ పరిరక్షణ– సవాళ్లు’ అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి నర్సమ్మ అధ్యక్షతన సెమినార్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడివయ్య హాజరై మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. ప్రజలంతా రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంపదను సంపన్నులకు కట్టబెట్టుతున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోశ్‌ కుమార్‌, నాయకులు యశోద, కవిత, యాదగిరి, దుర్గ, స్వరూప, చంద్రం, కిష్టయ్య, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement