నారాయణఖేడ్: పార్టీలకతీతంగా, అవినీతి రహితంగా ప్రజలకు సేవలు అందించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులకు సూచించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్తుశాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించి అధికారులు రైతుల వద్ద డబ్బులు తీసుకుని డీడీలు చెల్లించడం ఏమిటని, రైతులే నేరుగా బ్యాంకుల్లో చెల్లిస్తారు కదా అని ప్రశ్నించారు. విద్యుత్ కాంట్రాక్టర్ల ఇళ్ల వద్ద విద్యుత్ సామగ్రి డంప్‌లు ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయంలోనే సామగ్రి ఉంచి ఏడీఈ బాధ్యతగా రైతులకు అందించాలని ఆదేశించారు. డీడీలు కట్టిన రైతులకు కొన్ని స్తంభాలు వైర్లు ఇచ్చి ట్రాక్టర్లు మిగితావి అమ్ముకుంటున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇకనుంచి అలాంటివి జరగకుండా చూడాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు తాగునీరు, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సమీక్షలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సుధీర్ కుమార్, డీఈ శ్రీనివాసులు, ఏడీఈ నాగిరెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ డీఈఈ ఫణివర్మ, ఆయాశాఖల ఏఈలు పాల్గొన్నారు.
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి


