● ఇబ్బంది పడుతున్న డీలర్లు, వినియోగదారులు ● ఇంకా 90 షాపులకు చేరని స్టాక్
బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం
కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. దీంతో వినియోగదారులతో పాటు డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆన్‌లైన్‌లో వేలిముద్ర పెట్టి బియ్యం తీసుకునే ప్రక్రియ గతంలో రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే పూర్తికాగా, ప్రస్తుతం మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. అలాగే మూడు సార్లు బియ్యం తూకం వేయడం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పలు దుకాణాలకు మొదటి విడతగా పంపిణీ చేసిన బియ్యం స్టాక్ పూర్తి కావొచ్చింది. ఇదిలా ఉండగా ఇంకా 90 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాకపోవడం గమనార్హం.
– రామాయంపేట(మెదక్)
జిల్లావ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచే సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ దుకాణాల్లో మూడు నెలల కోటా బియ్యం స్టాక్ చేయడానికి తగినంతగా స్థలం లేకపోడంతో ఒకేసారి బియ్యం పంపిణీ చేయకుండా విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. మొదటి విడతగా 430 దుకాణాలకు 50 శాతం స్టాక్ 7,600 మెట్రిక్ టన్నుల మేర బియ్యం సరఫరా చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో రేషన్ షాపుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. ఈనెల 15లోగా అన్ని రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీ పూర్తవుతుందని, నెలాఖరువరకు డీలర్లు వినియోగదారులకు మూడు కోటాల బియ్యం పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాతో మండలస్థాయిలో ఉన్న గోదాముల్లో బియ్యం స్టాక్ నిండుకుంది.
ఈ– పాస్ మొరాయింపు
గంటల తరబడి నిరీక్షించే ఓపికలేక లబ్ధిదారులు డీలర్లతో గొడవకు దిగుతున్నారు. కొందరి వేలిముద్రలు సరిగా పడకపోవడం సమస్యగా మారుతోంది. రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునే వారిలో 70 శాతానికి పైగా వృద్ధులు, కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వారు ఉండటంతో వారి వేలిముద్రలను ఈ–పాస్ యంత్రం సరిపోల్చడం లేదు. దీనికి తోడు మారుమూల గ్రామాలు, కొన్ని గిరిజన తండాల్లో నెట్‌వర్క్ సమస్యతో ఈ–పాస్ యంత్రాలు సరిగా పనిచేయడం లేదు.
జిల్లాలో ఇలా ..
రేషన్ దుకాణాలు 520
రేషన్ కార్డులు 2,16,716
బియ్యం కోటా 15 వేల ఎం.టీ
నెలాఖరు వరకు పంపిణీ
ఈనెల 15లోగా జిల్లా పరిధిలోని అన్ని రేషన్ దుకాణాలకు రేషన్ పంపిణీ పూర్తవుతుంది. ఇప్పటికే 430 దుకాణాలకు 50 శాతం మేర బియ్యం పంపిణీ చేశాం. ఈనెలాఖరులోగా వినియోగదారులకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం.
– జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి


