కొనసాగిన అరిగె వారి హవా
కొల్చారం(నర్సాపూర్): రంగంపేట రాజకీయం ఎప్పుడు రసవత్తరంగా ఉంటుంది. మండల వ్యవస్థ ఏర్పాటు సమయంలో అప్పుడు తెలుగుదేశంలో ఉన్న గ్రామానికి చెందిన ధర్మగౌడ్ వరుసగా మూడుసార్లు సర్పంచ్‌గా తిరుగులేని నాయకుడుగా కొనసాగుతూ వచ్చారు. అతని తర్వాత ఎల్‌ఎల్‌బీ చేసి యువ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అరిగె రమేశ్‌కుమార్ (ప్రస్తుతం డీసీఎంఎస్ వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు) కాంగ్రెస్‌తో రాజకీయ ప్రవేశం చేసి తొలిసారి ధర్మగౌడ్‌పై పోటీ చేసి గెలిచారు. అక్కడి నుంచి వెనక్కి తిరగి చూడలేదు. సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా, టెస్కో డైరెక్టర్‌గా, భార్య రజని సర్పంచ్‌గా, ఎంపీపీగా ఒక మారు, సోదరుడు విజయ్ కుమార్ సర్పంచ్ (ఏకగ్రీవం)గా కొనసాగుతూ వచ్చారు. 2019లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఆ కుటుంబం దూరంగా ఉంది. ప్రస్తుతం రంగంపేట సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో విజయ్ కుమార్ భార్య స్వర్ణలత బీఆర్‌ఎస్ మద్దతుదారుగా పోటీలో నిలిచారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి అనితపై 73 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.


