ఓటెత్తిన పల్లెలు
మెదక్‌జోన్: పల్లె ఓటరు ఓటెత్తారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత ఉత్సాహంగా ఓటేశారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మా ల్, రేగోడ్, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో పోలింగ్ జరిగింది. ఏకగ్రీవం అయిన సర్పంచ్ స్థానాలు 16 మినహాయిస్తే 144 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరిగింది. అలాగే ఏకగ్రీవం అయిన 333 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,069 వార్డు సభ్యులకు పోలింగ్ నిర్వహించారు. టేక్మాల్ మండలంలోని అసద్‌మహ్మద్‌పల్లి స ర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయినప్పటికీ, వార్డు సభ్యులకు, అలాగే హవేళిఘణాపూర్ మండలంలోని గాజిరెడ్డిపల్లి సర్పంచ్ సైతం ఏకగ్రీవం అయినప్పటికీ వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ప్రారంభంలో మందకొడిగా..
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి రెండు గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 10 గంటల నుంచి ఊపందుకుంది. 11 గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా జిల్లా నుంచి హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్లిన వారు సైతం వచ్చి ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎన్నికల సరళిని పరిశీలించారు.
పలుచోట్ల ఆలస్యంగా కౌంటింగ్
పోలింగ్ ముగిసిన తర్వాత భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతో కొన్ని గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను వేరు చేసి 25 బ్యాలెట్ పేపర్లకు ఒక కట్ట కట్టారు. ఆ తర్వాత ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించారు. ముందుగా వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచ్ పదవుల ఫలితాలను ప్రకటించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు వచ్చాయి. మండల కేంద్రాలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు ఫలితాలు వచ్చాయి.
మండలాల వారీగా ఓటర్లు
ఆరు మండలాల పరిధిలో మొత్తం 1,63,148 ఓటర్లు ఉండగా, వాటిలో 1,44,323 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లాదుర్గం మండలంలో 23,555 ఓట్లు ఉండగా, 20,784 ఓటు హక్కు వినియోగించుకున్నారు. హవేళిఘణాపూర్ మండలంలో 29,646 ఓట్లు ఉండగా, 26,328 మంది ఓటు వేశారు. పాపన్నపేటలో 36,213 మంది ఓటర్లు ఉండగా 32,176 మంది, రేగోడ్‌లో 18,747 ఓటర్లు ఉండగా 17,085 మంది, పెద్దశంకరంపేటలో 28,254 మంది ఓటర్లు ఉండగా, 24,543 మంది, టేక్మాల్‌లో 26,733 మంది ఓటర్లు ఉండగా 23,407 మంది ఓటు వేశారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్
88.46 శాతం నమోదు
పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లేసిన పల్లె వాసులు


