నేడే తొలి పోరు
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
మెదక్‌జోన్: గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది బుధవారమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని తీసుకొని కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల్లో పా ల్గొనే అధికారులకు బ్యాలెట్ పేపర్లను దగ్గరుండి అదనపు కలెక్టర్ నగేశ్ అందజేశారు.
తేలనున్న భవితవ్యం
గ్రామ సర్పంచ్ పదవులకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
పోలింగ్ జరిగే గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్‌స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుండగా, సమస్యాత్మక గ్రా మాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 690 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
144 సర్పంచ్, 1,069 వార్డు స్థానాలు
మొదటి విడతలో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘణాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల పరిధిలో 160 గ్రామాలు, 1,402 వార్డు స్థానాలు ఉండగా.. ఇందులో 16 సర్పంచ్, 333 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 144 సర్పంచ్, 1,069 వార్డు స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
2 గంటల నుంచి కౌంటింగ్.. అనంతరం ఫలితాల ప్రకటన
వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది


