చెరకు రైతులకు తీపి కబురు
● కొత్త యాజమాన్యం చేతుల్లోకి ‘ట్రైడెంట్’ ● జనవరిలో క్రషింగ్‌కు కసరత్తు
జహీరాబాద్: జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే.. ఈ విషయమై యాజమాన్యం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. మహారాష్ట్రకు చెందిన ఓ బడా సంస్థ కర్మాగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో క్రషింగ్‌ను చేపట్టేందుకు వీలుగా కొత్త యా జమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్మాగారంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ విషయాన్ని కార్మిక వర్గాలు సైతం ధృవీకరించాయి. కర్మాగారంలో క్రషింగ్ నిర్వహించేందుకు యాజమాన్యం చేతులెత్తేయడంతో మూడేళ్లుగా మూత పడింది. దీంతో జహీరాబాద్ జోన్ పరిధిలో ఉన్న సుమారు 8లక్షల టన్నుల చెరకు పంట రాష్ట్రంలోని గణపతి, కొత్తకోట, మాగి తదితర కర్మాగారాలకు తరలించారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం రైతులు చెరకు ఉత్పత్తులను తరలించుకుని విక్రయాలు చేసుకోక తప్పలేదు. 2020–21 సీజన్‌లో ట్రైడెంట్ యాజమాన్యంలో క్రషింగ్ చేపట్టక పోవడంతో మూతపడింది. 2022–23 సీజన్‌కు గాను కర్మాగారంలో క్రషింగ్ నిర్వహించారు. అప్పట్లో 2.55లక్షల టన్నుల చెరకు ను కర్మాగారం క్రషింగ్ జరిపింది. అనంతరం యా జమాన్యం రైతులకు బిల్లులు వాయిదాల రూపంలో చెల్లిస్తూ పోయింది. అయినా రూ.9 కోట్ల బిల్లులు రైతులకు బకాయి పడింది. అధికార యంత్రాంగం కర్మాగారాన్ని వేలం వేసి రైతులకు చెల్లించేందుకు సిద్ధపడింది. దీంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఎట్టకేలకు యాజమాన్యం బకాయి లు చెల్లిస్తూ వచ్చింది. ఇంకా రూ. 9 లక్షల మేర రైతుల బిల్లులు బకాయి ఉన్నట్లు సమాచారం.
పూర్తిస్థాయిలో క్రషింగ్
కర్మాగారంలో ఉన్న యంత్రాలను యాజమాన్యం తరలించే ప్రయత్నం చేయడంతో తాము అభ్యంతరం చెప్పి నిలిపివేసినట్లు జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్ వెల్లడించారు. ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన సంస్థ కర్మాగారాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కర్మాగారంలో మరమ్మతులు పనులు ప్రారంభం అయ్యాయని, జనవరిలో క్రషింగ్‌ను మొదలు పెట్టే విధంగా కొత్త యాజమాన్యం కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. వచ్చే సీజన్‌లో పూర్తి స్థాయిలో క్రషింగ్ నిర్వహిస్తామన్నారు.


