మీనమేషాలు !
చేప పిల్లలు చెరువులకు చేరేదెప్పుడో?
● మించిపోతున్న సమయం ● హెచరీల్లో కానరాని ఉత్పత్తి ● లక్ష్యం 5 కోట్లు.. పంపిణీ కోటి మాత్రమే..
కొల్చారం(నర్సాపూర్): ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆగస్టు నుంచి పంపిణీ చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో మత్స్యకారుల్లో నిరాశ నెలకొంది. ఈసారి సకాలంలో కురిసిన వర్షాలతో జిల్లాలో చెరువులు నిండుకుండలా మారాయి. అయితే సమ యం మించిపోతుండటంతో మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువు ల్లో వదులుతున్నారు. గతంలో జిల్లాలోని ఘనపురం, హల్దీ ప్రాజెక్టుల్లో చేపల పెంపకం చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా 15.36 ఎకరాలను కేటాయిస్తూ 6 ఎకో హేచరీలు ఏర్పాటుచేసి వాటిలో చేప విత్తన ఉత్పత్తి చేశారు. ఏప్రిల్, మే నెలల్లోనే జిల్లాలో నీటి వనరుల నుంచి తల్లి పిల్లల ను సేకరించి స్పాన్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించే వారు. గతంలో 5 కోట్ల చేప పిల్లలను పెంచారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తిలో లక్ష్యంగా కట్ల, రోగు, మగాల, బంగారు తీగ వంటి పెంపకం చేపట్టారు. ఈసారి హేచరీల్లో చేప పిల్లల పెంపకం చేపట్టకపోవడంతో ఉత్పత్తి లేకుండాపోయింది. గతంలో జిల్లా కు సరిపోను 11 ఇతర జిల్లాలకు సరఫరా చేశారు.
పక్క రాష్ట్రం నుంచి దిగుమతి
ఈసారి జిల్లాలోని 1,614 చెరువుల్లో 5 కోట్ల చేపల పెంపకం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు నుంచే చేప పిల్లల పంపిణీ చేపట్టాల్సి ఉన్నా, ఉత్పత్తిలేకపోవడంతో ఏపీలోని కైకలూరు నుంచి చేప పిల్లలు దిగిమతి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లాకు చేరింది కోటి చేప పిల్లలు మాత్రమే. దీంతో కొంతమంది మత్స్యకారులు స్వయంగా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ హేచరీల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు.
2 లక్షల చేపలు కొనుగోలు చేశాం
ప్రభుత్వం నుంచి ఉచితంగా అందాల్సిన చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యం అయింది. జిల్లా కేంద్రానికి వెళ్తే అందుబాటులో లేవంటున్నారు. దీంతో ఇటీవలే సొంత డబ్బులు వెచ్చించి 2 లక్షల చేప పిల్లలు కొనుగోలు చేసి రెండు చెరువుల్లో వదిలాం.
– యాదగిరి, మత్స్యకారుడు, రంగంపేట
త్వరలో లక్ష్యం చేరుకుంటాం
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హేచరీలు దెబ్బతినడంతో చేప పిల్లల పెంపకం చేపట్టలేకపోయాం. మత్స్యకారుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఏపీ నుంచి రోజువారీగా బొత్స, మీరుగం, రౌట, బంగారు తీగ చేప పిల్లల దిగుమతి చేసుకొని అందజేస్తున్నాం. అనుకున్న లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటాం. ఈ విషయంలో మత్స్యకారులు నిరుత్సాహ పడొద్దు.
– మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లాలో ఇలా..
నీటి వనరులు 1,614
మత్స్య సంఘాలు 272
సభ్యులు 17,500
హేచరీలు 06


