అతివలే కీలకం
జిల్లాలో పురుష ఓటర్లతో పోలిస్తే
20 వేల పైచిలుకు అధికం
ప్రసన్నం చేసుకుంటున్న ఆశావహులు
పల్లెల్లో మొదలైన సందడి
స్థానిక ఎన్నికల్లో మహిళలదే నిర్ణయాధికారం
సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పల్లెల్లో ఎన్నికల
సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే జిల్లాలో మహిళా ఓటర్లు 20 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం
చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంపగుత్త ఓట్ల కోసం కులసంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.
– మెదక్‌జోన్
జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయతీలు, 4,220 వార్డులు ఉండగా, 5,23,327 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,71,787 మంది మహిళలు కాగా, 2,51,532 మంది పురుష ఓట ర్లు.. మరో 8 మంది ఇతరులు ఉన్నారు. కాగా పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 20,255 అదనంగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నమయ్యారు.
జిల్లాలో 21 మండలాలు ఉండగా, అన్ని మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మెదక్, నర్సాపూర్, నిజాంపేట, చిన్నశంకరంపేట, శివ్వంపేట, టేక్మాల్, వెల్దుర్తి, అల్లాదుర్గం, చేగుంట, కొల్చారం, రామాయంపేట మండలాల్లో పురుషుల ఓట్లతో పోలిస్తే మహిళా ఓటర్లు ఒక్కో మండలంలో వెయ్యికిపైగా ఎక్కువగా ఉన్నారు. హవేళిఘణాపూర్ మండలంలో 2 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. మరో తొమ్మిది మండలాల్లో సైతం పురు షుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతల గెలుపోటముల్లో మహిళా ఓటే కీలకం కానుంది.
ఆశావహులు గంపగుత్త ఓట్ల కోసం కుల సంఘాలను ప్రసన్నం చేసుకుంటున్నారు. గంపగుత్తగా ఓట్లు వేస్తే వంటపాత్రలు, టెంట్‌హౌస్ సామగ్రి, కుల దేవాలయం నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజలు పగలంతా పొలాల పనులకు వెళ్లటంతో ఉదయం, సాయంత్రం వేళ ఓటర్లను కలుస్తున్నారు. మొదటి విడత ఎన్నికలకు కేవలం 15 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆ మండలాల్లో ఎన్నికల వేడి రాజుకుంది.


