డీసీసీబీ మేనేజర్‌కు పదోన్నతి
నారాయణఖేడ్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఖేడ్ బ్రాంచి మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశంకు ఏజీఎంగా పదోన్నతి కల్పిస్తూ సీఈఓ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశం ఖేడ్ బ్యాంకు మేనేజర్‌గా బ్యాంకు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అయన స్థానంలో పాపన్నపేట మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్‌ను నియమించారు.
వరద నష్టానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయండి
మంత్రి సురేఖకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
పాపన్నపేట(మెదక్): మంజీరా వరదల వల్ల ఏడుపాయల్లో దెబ్బతిన్న ప్రాంతాలను మరమ్మతు చేయడానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం కావడంతో లక్షలాది మంది భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలి వస్తుంటారని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన రామతీర్థం గ్రామానికి చెందిన కన్నె బోయిన గంగారాంకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
చాకరిమెట్లకు కార్తీక శోభ
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులు సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. భక్తులు రాజుయాదవ్, రవీందర్, శంకర్ నిత్యాన్నదానానికి రూ. 45 వేల విరాళం అందజేశారు.


