
938 పశువుల పాకలు మంజూరు
● డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు
తూప్రాన్/మనోహరాబాద్: జిల్లావ్యాప్తంగా రైతులకు 938 పశువుల పాకలు మంజూరైనట్లు డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల్లో నిత్యం రెండు దఫాలుగా ఎన్‌ఎంఎంఎస్ ద్వారా హాజరుశాతం నమోదు చేయాలని సూచించారు. అలాగే వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. మండలానికి 75 వేల మొక్కల టార్గెట్ ఉందన్నారు. అలాగే మనోహరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఎన్‌ఆర్‌జీఎస్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎంపీడీఓలు సతీశ్, రవీందర్, ఏపీఓ సంతోశ్, పంచాయతీ కార్యదర్శులు, పీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.