
అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
● కలెక్టర్ రాహుల్‌రాజ్
● ప్రజావాణిలో 66 వినతుల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి కలెక్టరేట్‌లో వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఒకే సమస్యపై పలుమార్లు వినతిని సమర్పించకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాగానే తీసుకున్న నిర్ణయాన్ని సదరు ఫిర్యాదుదారుడికి సమాచారం చేరవేయాలన్నారు. లేనిచో మళ్లీ అదే సమస్యపైన వినతి సమర్పించేందుకు గ్రీవెన్స్‌కు ప్రజలు రావాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇదిలాఉండగా ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలను 66 అర్జీలను సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావుతో పాటు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
త్వరగా భూ సమస్యలు పరిష్కరించాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): జిల్లావ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, ఎరువుల ధరల గురించి ఆరా తీశారు. జిల్లాలో సుమారు 4,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు యూరియా సరిపోకపోతే, ఇంకా తెప్పిస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. భూభారతి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్ మండలంలో వచ్చిన రెవెన్యూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని కేజీబీవీలు, రెసిడెన్షియల్, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్ల పంపిణీపై ప్రభుత్వం జీఓ విడుదల చేసినట్లు తెలిపారు. కోడిగుడ్ల సరఫరా ప్రక్రియ ఆన్‌లైన్ టెండర్ విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం మెదక్ నుంచి బదిలీపై వెళ్తున్న లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు.