
సింగూరు నీరు విడుదల చేయండి
మెదక్ కలెక్టరేట్: సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రైతులను పట్టించుకున్న పాపానపోవడం లేదని విమర్శించారు. సింగూరులో నీరు ఉన్నప్పటికీ ఘనపూర్ ప్రాజెక్టుకు 0.4 టీఎంసీలు వాటాగా రావాల్సినవి విడుదల చేయడం లేదని మండిపడ్డారు. గతం ప్రభుత్వంలో సమయానికి నీరు వదిలామని గుర్తుచేశారు. సింగూరు, కాళేశ్వరం జలాలు, కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు సాగు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు జిల్లాలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించండం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు మల్లికార్జున గౌడ్, బట్టి జగపతి, లావణ్య రెడ్డి, ఇతర నాయకులు ఆంజనేయులు, లింగారెడ్డి, జుబేర్, జీవన్‌రావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన