
ఇందిరమ్మ ఇళ్లు కట్టలేం!
మెదక్‌జోన్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు భారంగా మారింది. ముడి సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని, ఇందుకు అవసరమైన రవాణా ఖర్చులను మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు ఇసుక తెప్పించకపోవటంతో బయట మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 4 వేలు చెల్లించి లబ్ధిదారులు కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఇసుకకే రూ. 30 నుంచి రూ. 40 వేలు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు పోనూ పేదలపై మరో రూ. లక్షకుపైగా భారం అదనంగా పడనుంది.
మొదటి విడతలో 9 వేల ఇళ్లు మంజూరు
జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొ ప్పున జిల్లాకు 7 వేల ఇళ్లు మంజూరు కావాల్సి ఉంది. ఇవి కాకుండా జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, ఆందోల్, నారాయణఖేడ్, నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలు ఉండటంతో జిల్లాకు మొదటి విడతలో 9 వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 5 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, అందులో 360 ఇళ్ల బేస్‌మెంట్ పూర్తి అయింది. వారికి రూ. లక్ష చొప్పున బిల్లులు అందించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మేర నిర్మించుకోవాలి. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున, నాలుగు విడతల్లో డబ్బు లను లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనుంది.
ఒక్కో సిమెంట్ బస్తా ధర రూ. 360
కానీ ఇంటి నిర్మాణానికి వినియోగించే సిమెంట్, ఇసుకతో పాటు అన్నింటి ధరలు బయట మార్కెట్‌లో పెరిగాయి. ఇందులో ప్రధానంగా ఇంటి నిర్మాణానికి 150 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం రూ. 42 వేలను ధరల పట్టికలో చూపించా రు. ఈ లెక్కన ఒక్కో బస్తా సిమెంట్‌కు ప్రభుత్వం రూ. 280 చొప్పున చెల్లిస్తోంది. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఒక్కో బస్తా సిమెంట్ ధర రూ. 360 ఉంది. ఈ లెక్కన 150 బస్తాలకు రూ. 54 వేలు అవుతుంది. అంటే కేవలం సిమెంట్‌కు రూ. 12 వేలు అదనంగా లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అలాగే ఇంటి నిర్మాణం మొత్తానికి 8 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుందని, ఇసుకను లబ్ధిదారుడికి ఉచితంగా అందిస్తామని, రవాణా ఖర్చులు రూ. 8 వేలు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇసుకను తెప్పించిది లేదు, ఉచితంగా ఇచ్చింది లేదు. ఫలితంగా లబ్ధిదారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 4 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన రూ. 32 వేలు అదనంగా ఖర్చవుతోంది. అలాగే స్టీల్, కంకర, ఇటుకలు, ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సా మగ్రి ప్రభుత్వం ఇచ్చే ధరతో పోలిస్తే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అందుకే ఇళ్లు మంజూరైనా కొంతమంది పేదలు ఇళ్ల నిర్మాణాలను ప్రా రంభించడం లేదు. ఇప్పటికై నా అధికారులు ఉచితంగా ఇస్తామన్న ఇసుకను త్వరగా తెప్పించి లబ్ధిదారులకు అందించాల్సిన అవసరం ఉంది.
పెరిగిన నిర్మాణ వ్యయం
జాడలేని ఉచిత ఇసుక
ప్రభుత్వం ఇచ్చేది రూ. 5 లక్షలు
లబ్ధిదారులపై అదనపు భారం