
చెరువులు నింపని వాన
ముఖం చాటేసిన వరుణుడు
● ముందుకు సాగని వ్యవసాయ పనులు ● ఆందోళనలో అన్నదాతలు ● బోర్ల కింద జోరుగా సాగు..
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
మండలం వర్షపాతం మి.మీ
కొల్చారం 193.0
పెద్దశంకరంపేట 151.9
రేగోడ్ 161.7
అల్లాదుర్గం 159.4
టేక్మాల్ 145.7
పాపన్నపేట 135.6
హవేళిఘణాపూర్ 175.1
రామాయంపేట 172.3
నిజాంపేట 174.2
చేగుంట 164.1
నార్సింగి 129.8
చిన్నశంకరంపేట 152.9
మెదక్ 168.7
చిలప్‌చెడ్ 113.7
కౌడిపల్లి 107.6
నర్సాపూర్ 108.1
శివ్వంపేట 131.2
వెల్దుర్తి 145.7
తూప్రాన్ 152.0
మాసాయిపేట 92.7
మనోహరాబాద్ 53.9
వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. అడపాదడపా కురుస్తున్న వానలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నా.. మరోవైపు ఆందోళన తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు చెరువులు, కుంటల్లో నీరు చేరేంత వర్షాలు పడలేదు. మేలో కురిసిన వర్షాలతోనే ప్రస్తుతం రైతులు బోర్ల కింద సాగు చేస్తున్నారు.
– మెదక్ కలెక్టరేట్
జిల్లాలో గతేడాది ఈ సమయానికి 171 మి.మీ వర్షం కురవగా, ఈఏడాది ఇప్పటివరకు 142.3 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ ఎక్కడా చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. కాగా మేలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దీంతో బోర్లలో నీటి ఊటలు పెరిగాయి. వాటిపై ఆధారపడిన రైతులు ప్రస్తుతం వరి సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, వర్షాలపై ఆధారపడిన వారు దుక్కులు దున్ని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారం రోజుల క్రితం వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో పడలేదని రైతులు వాపోతున్నారు. నాట్లు వేసేంత నీరు రాలేదని చెబుతున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు 142.3 మి.మీ వర్షం పడింది. అది కూడా భారీగా కాకుండా విడతల వారీగా కురిసింది. ఇదే సమయంలో ఎండలు మండుతుండటంతో ఎక్కడికక్కడే వర్షం నీరు ఆవిరైపోతుంది. దీంతో జిల్లాలోని ఒక్క చెరువు, కుంట పూర్తిస్థాయిలో నిండలేదు. కాగా జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు కొల్చారం మండలంలో అత్యధికంగా 193 మి.మీ వర్షం కురవగా, మనోహరాబాద్ మండలంలో అత్యల్పంగా 53 మి.మీ కురిసింది. మొత్తం 2,694 చెరువులు ఉండగా, ఒక్క చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండలేదు.
జిల్లాలో పంటల సాగు ఇలా..
జిల్లాలో వరి సాగు అంచనా 3,05,100 ఉండగా, ఇప్పటివరకు 7 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. మరో 11 వేల ఎకరాలకు రైతులు నారుపోసి నాటు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆరుతడి పంట అయిన పత్తి అంచనా 37,200 కాగా, ఇప్పటివరకు 33 వేల ఎకరాల్లో సాగు చేశారు. అలాగే మొక్కజొన్న 2,640 ఎకరాల అంచనా ఉండగా, ఇప్పటివరకు కేవలం 600 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
వరి నారు పెరుగుతుంది
చెరువు, కుంటలు వెలవెలబోతున్నాయి. బోర్లున్న రైతులు నాట్లు వేసుకుంటున్నారు. దుక్కులు దున్ని వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నాం. వర్షం పడితేనే నాట్లు సాగుతాయి. వరి నారు కూడా పెరుగుతుంది. ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాళ్ల నుంచి నీరు కూడా రావడం లేదు.
– గజ్జెల బాలపోచయ్య, మద్దుల్వాయి

చెరువులు నింపని వాన

చెరువులు నింపని వాన