
పెరగనున్న బీసీ పాలకులు
42 శాతం రిజర్వేషన్ అమలైతే 206 మందికి అవకాశం
మెదక్‌జోన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఇది అమలైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలకు అధిక మొత్తంలో రాజ్యాధికారం దక్కనుంది. జిల్లాలో 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 469 గ్రామ పంచాయతీలు, 4,086 వార్డులు ఉండగా, గత ప్రభుత్వం కొత్తగా 23 పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 492కు చేరుకుంది. అలాగే అప్పట్లో వార్డులు 4,086 ఉండగా, కొత్తగా 134 వార్డులను కొత్తగా ఏర్పాటు చేయటంతో వాటి సంఖ్య 4,220కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్‌లు ఎస్టీలకు 80, ఎస్సీలకు 66, బీసీలకు 120 కాగా, ఇతరులు 203 మంది ఉన్నారు. కాగా ఈ రిజర్వేషన్‌లో సుమారు సగం మంది మహిళలు కాగా, మిగితా సగం మంది పురుషులు ఉన్నారు.
మండల, జిల్లా పరిషత్‌లోనూ ..
గతంలో జిల్లావ్యాప్తంగా 189 ఎంపీటీసీలు ఉండగా, అప్పటి 22 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 41 సీట్లు లభించాయి. కాగా ఇటీవల ఒక ఎంపీటీసీ స్థానం పెరగటంతో ఆ సంఖ్య 190కి చేరుకుంది. ఈ లెక్కప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలైతే బీసీలకు 79 సీట్లు దక్కనున్నాయి. అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు గతంలో 20 చొప్పున ఉండగా, నూతనంగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయటంతో ఎంపీపీలు 21, జెడ్పీటీసీ స్థానాలు 21కి చేరుకున్నాయి. కాగా నూతన రిజర్వేషన్ అమలైతే బీసీలకు 8 సీట్ల చొప్పున పాలనాపరమైనా స్థానం కై వసం కానుంది.
బీసీ రిజర్వేషన్ అమలైతే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలైతే, ప్రస్తుతం జిల్లాలో 492 గ్రామ పంచాయతీలకు గానూ ఎస్సీ, ఎస్టీలకు అప్పటి రిజర్వేషన్ అమలు కాగా, ఇతరుల రిజర్వేషన్‌లో కోతపడి బీసీలకు 206 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే ఎస్సీలకు 66, ఎస్టీలకు 80, మిగితా 140 సీట్లలో ఇతరులు, (ఓసీలకు) అవకాశం ఉంటుంది. అలాగే వార్డు మెంబర్లకు సైతం ఇదే తరహా రిజర్వేషన్లు వర్తించనుంది.