
పురభివృది్ధకి నిధులు!
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ. 60 కోట్లు ● ప్రతిపాదనలు పంపిన అధికారులు ● త్వరలో విడుదల చేయనున్న ప్రభుత్వం
రామాయంపేట(మెదక్): పట్టణాల్లో నెలకొన్న సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ పని చేయాలన్నా నిధుల కొరతతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో మన్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికే అధికారులు పలుమార్లు ప్రతిపాదనలు పంపినా నిధుల మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం పట్టణాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించింది. ఈ మేరకు త్వరలో నిధులు మంజూరు చేయడానికి కసరత్తు చేస్తుంది. కాగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించిన అధికారులు జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 60 కోట్లు మంజూరు చేయాలని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
పేరుకుపోయిన సమస్యలు
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో పేరుకుపోయిన సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై రోడ్లపై మురుగు నీరు పారుతుంది. ఇళ్ల మధ్య నిలిచిన మురుగుతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. కొన్నిచోట్ల మురుగు కాలువల్లో నుంచి వేసిన పైపులైన్లతో తాగు నీరు కలుషితమవుతోంది. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రహదార్లను ఆనుకొని ఉన్న పెంటకుప్పలతో దుర్వాసన వెదజల్లుతుంది. ఫలితంగా దోమల బాధ పెరిగిపోయింది. రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.
పాలకవర్గాల హయాంలోనే..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగియముందే ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి ఆమోదం తెలిపాయి. ప్రధానంగా రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు, ఇతర సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల నిర్వహణనకు త్వరలో నిధులు మంజూరు కానున్నాయి.
ప్రతిపాదనలు పంపాం
మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తాము ప్రతిపాదనలు పంపాం. మంజూరయ్యే నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువలతో పాటు ఇతర ప్రాధాన్యత గల పనులకు సంబంధించి నిర్మాణాలు చేపడుతాం.
– దేవేందర్,
మున్సిపల్ కమిషనర్, రామాయంపేట

పురభివృది్ధకి నిధులు!