కార్పొరేటు విద్య ఉచితం
మెదక్ కలెక్టరేట్: నిరుపేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి జిల్లాలో మెరుగైన వసతులు కలిగిన ఐదు ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి ఏడాది లక్కీ డ్రా ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పించారు. కలెక్టరేట్‌లోని ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు పత్రాలు అందజేస్తున్నారు.
ఎస్సీ విద్యార్థులకు 120 సీట్లు
బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎస్సీ విద్యార్థులు చేరేందుకు ఒకటవ తరగతికి 59 సీట్లు, 5వ తరగతికి 61 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఎంపిక కోసం ఈనెల 20న మెదక్ కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికై తే జిల్లాలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేరే అవకాశం ఉంటుంది.
ఎస్టీ విద్యార్థులకు 49 సీట్లు
ఎస్టీ విద్యార్థులకు మొత్తం 49 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 3వ తరగతి(25), 5వ తరగతి(12), 8వ తరగతి(12) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. 20న కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న గిరిజన విద్యార్థులు సేయింట్ జోసెఫ్ హైస్కూల్, సంగారెడ్డి, శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం సిద్దిపేటలో విద్యాభ్యాసం చేసే అవకాశం దక్కుతుంది.
ఎస్టీ బాలికలకు 33శాతం రిజర్వేషన్
ఎస్టీ బాలికలకు 33శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. విద్యార్థులు అంతకు ముందు చదివిన తరగతుల బోనఫైడ్‌లు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1,50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. పూర్తిచేసిన దరఖాస్తు పత్రాలను ఈనెల 17వ తేదీ సాయంత్రంలోగా జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని ఎస్టీ అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలి.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు
విద్యార్థులు దరఖాస్తు పత్రానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. మీ సేవ ద్వారా 2025 జనవరి తర్వాత పొందిన జనన ధ్రువీకరణ, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బోనఫైడ్, ప్రోగ్రెస్‌కార్డులు కలిగి ఉండాలి.
బెస్ట్ అవైలబుల్ పథకం.. పేద విద్యార్థులకు వరం
ఎస్టీ విద్యార్థులకు 49 సీట్లు
ఈనెల 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
అర్హతలు
బెస్ట్ అవైలబుల్ పథకం కింద దరఖాస్తు చేసుకునే ఎస్సీ విద్యార్థులు 1వ తరగతిలో చేరేందుకు యూకేజీ పూర్తి చేసి ఉండాలి. 1వ తరగతిలో చేరేందుకు 2019 జూన్ 01 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. అలాగే 5వ తరగతిలో చేరేందుకు 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. 2024–25లో 4వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 5వ తరగతిలో చేరేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1,50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా మెదక్ సమీకృత కలెక్టరేట్‌లోని ఎస్సీ అభివృద్ధి కార్యాలయాల్లో సమర్పించాలి.


