పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
తూప్రాన్: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు 60 రోజుల కంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే సాదాబైనామా, ఎన్‌ఎఫ్‌బీఎస్, ప్రజావాణి, మీసేవ దరఖాస్తులు తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.


