నిబంధనలకు ‘బంక్’
పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలేవి?
● కానరాని ఫస్ట్ ఎయిడ్.. టాయిలెట్లు అంతంతే ● ఉచిత ఎయిర్ ఉత్తిదే.. జాడలేని తాగునీరు
మెదక్ కలెక్టరేట్: పెట్రోల్ బంకుల్లో టైర్లకు గాలి కొట్టిద్దామంటే అవకాశం ఉండదు.. దాహం వేస్తే తాగునీరు దొరకదు.. మరుగుదొడ్లు ఏ ర్పాటు చేయడం లేదు. ఇలా జిల్లాలో పెట్రోల్ బంకుల నిర్వహణ అధ్వానంగా ఉంది. నిబంధనలను వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.
తనిఖీలో బయటపడ్డ లోపాలు
జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరిగింది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకనుగుణంగా పెట్రోల్ బంక్‌లు సైతం వెలిశాయి. జిల్లాలో సుమారు 100 వంద వరకు పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉన్నాయి. నిత్యం వాహనదారుల నుంచి ఆదాయం పొందుతున్న పెట్రోల్ బంక్‌ల యజమానులు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంక్‌లో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాహనదారులకు అందుబాటులో తాగునీరు, టాయిలెట్లు, ఉచిత గాలి, ఇంధన కొలతలు, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, సివిల్, ఫైర్, పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. అలాగే ప్రతి బంక్‌లో తప్పనిసరిగా ఆన్‌లైన్ పేమెంట్ చేసే విధంగా అవకాశం కల్పించాలి. ఇటీవల జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్‌లో అకస్మిక తనిఖీలు చేపట్టగా, అనేక లోపాటు వెలుగుచూశాయి. ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ టెస్ట్‌లో అనుమానాస్పద ఫలితాలు, తాగునీరు, టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టైర్లకు ఉచిత గాలి వంటి లోపాలు బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలోని ఒక బంక్‌లో తనిఖీలు చేస్తే ఇవన్నీ బయట పడితే, జిల్లాకు దూరంగా ఉన్న బంకులలో ఎన్ని సమస్యలున్నాయోనని వాహనదారులు వాపోతున్నారు.


