
విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టర్: విద్యాపరంగా జిల్లాను రాష్ట్రస్థాయి లో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎంఈఓలు, హెచ్‌ఎంలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా విద్యా ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. అందుకనుగుణంగా విద్యాధికారులు పనిచేయాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంపై అభినందించారు. ఇదే స్ఫూర్తితో బడిబాటను విజయవంతం చేయాలన్నారు. 15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన విద్యార్థులను గుర్తించి వారిని ‘ఉల్లాస్’ ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తప్పనిసరిగా జూనియర్ కళాశాలలో నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా చూసే బాధ్యత అంగన్‌వాడీ సిబ్బంది దేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, డీఈఓ రాధాకిషన్, మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రామేశ్వరప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
సత్వరమే పరిష్కరించండి
నర్సాపూర్/చిలప్‌చెడ్(నర్సాపూర్): రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని చండూర్‌లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిలప్‌చెడ్ మండలంలోని పది గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని తెలిపారు. రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 357 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. విచారణ ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నర్సాపూర్ అర్బన్ పార్కులో చేపట్టిన కాటేజీల నిర్మాణ పనులను డీఎఫ్‌ఓ జోజితో కలిసి పరిశీలించారు. మరో 20 రోజుల్లో కాటేజీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పా రు. ఆయన వెంట ప్రాజెక్టు మేనేజర్ జగన్మోహన్‌రెడ్డి, అటవీశాఖ అధికారులు ఉన్నారు.