
కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న అభ్యర్థులు
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయ నియామకాల్లో పోస్టులు పెంచాలని కోరుతూ డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద తెలిపి, అనంతరం కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 13,086 టీచర్ పోస్టులతో పాటు 5,089 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసినా అభ్యర్థులకు ప్రయోజనం దక్కడంలేదని వాపోయారు. ఏళ్లుగా వేచిచూస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థుల ఆశలపై నీళ్ళు చల్లేలా కేసీఆర్ ప్రకటన ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో అభ్యర్థులు వినయ్, సురేష్, గోపాల్, నరేష్, దుర్గా ప్రసాద్, అమతుల్ బేగం, లిఖిత, సాధన తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
పౌష్టికాహార పంపిణీ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం సరఫరా జరుగుతుందని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి బ్రహ్మజీ గురువారం తెలిపారు. జిల్లాలో 1,076 కేంద్రాలు ఉండగా 783 కేంద్రాల్లో యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. అంగన్‌వాడీల సమ్మె కారణంగా మరో 293 కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు, సూపర్‌వైజర్లు, మహిళా శిశు సంక్షేమశాఖ విభాగాల సిబ్బంది, ఆర్పీలు, మహిళా సమైఖ్య సంఘాల సభ్యుల ద్వారా నడిపిస్తున్నట్లు తెలిపారు. బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, ప్రీస్కూల్ పిల్లలకు టి–షాట్ ద్వారా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
భూమి పట్టాలివ్వండి
చిన్నశంకరంపేట(మెదక్): జాయింట్ సర్వే నిర్వహించిన భూమికి పట్టాలు అందించాలని చందంపేట గ్రామస్తులు కోరారు. గురువారం తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. గ్రామ శివారులోని 472 సర్వే నంబర్ భూమిలో 2020లో ఫారెస్టు రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ భూమికి పట్టాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శివకుమార్, వార్డుమెంబర్ ప్రవీణ్ రైతులు ఉన్నారు.
హర్యాణా గవర్నర్ సంతాపం
మెదక్ కలెక్టరేట్: రామాయంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి (ఆర్‌ఎస్ వాసురెడ్డి) మృతిపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. వాసురెడ్డి స్వగ్రామం చేగుంట మండలం పొలంపల్లిలో గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపై గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. సామాన్య కుటుంబం నుంచి శాసన సభ్యుడిగా వాసురెడ్డి ఎదిగారని, రామాయంపేట, ఉమ్మడి మెదక్ జిల్లాల సమస్యలపై పోరాటం చేశారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతంతో, అంకిత భావంతో ప్రజా సేవ చేశారని కొనియాడారు.
ఆలయ ప్రతిష్టను కాపాడాలి
పాపన్నపేట(మెదక్): దుర్గమ్మ తల్లి ఆభరణాల వివాదం, హలాల్‌తో జంతు వథలతో ఏడుపాయల ప్రతిష్ట మంట గలుస్తోందని రాష్ట్ర బజరంగ్ దళ్ అధ్యక్షుడు శివరాములు అన్నారు. గురువారం ఆయన ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. ఇటీవల దుర్గమ్మ, చాకరిమెట్ల ఆంజనేయ స్వామి, తునికి నల్లపోచమ్మ తల్లి ఆభరణాల పట్ల ఈఓ వ్యవహారంపై అధికారులు బదిలీతో సరిపెట్టారని మండిపడ్డారు. ఆలయ పరిసరాల్లో హలాల్ చేస్తున్నా ఈఓ, చైర్మన్‌లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయన వెంట వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, విభాగ్ కార్యదర్శి పుట్టి మల్లేశం, రామచంద్రారావు, సత్యనారాయణ, కృష్ణ తదితరులు ఉన్నారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న రైతులు

మాట్లాడుతున్న శివరాములు