బెల్ట్‌ తీస్తున్న ప్రజలు

చిన్నశంకరంపేట మండలం శేరిపల్లిలో మద్యం విక్రయించొద్దంటూ ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు - Sakshi

మద్యం బంద్‌ చేసిన పల్లెలు

● రామాయంపేట మండలం కె.వెంకటాపూర్‌లో 2009 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. గ్రామంలో మందు అమ్మినవారికి రూ.25 వేల జరిమానా, పట్టుకున్న వారికి రూ.5 వేల బహుమతి ఇస్తామని తీర్మానం చేయడంతో మద్యం అమ్మకాలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

● ఇదే మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో మద్యం అమ్మినా, తాగినా జరిమానా తప్పదంటూ గ్రామ పంచాయతీ ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేయటంతో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది.

● చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో 2016 నుంచి బెల్టుషాపుల నిర్వాహణ మాన్పించారు. ఇలా ఒక్కో గ్రామ ప్రజలు చైతన్యవంతులై మద్యానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మెదక్‌జోన్‌: మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి గ్రామ జనాభా 2,500. ఆ గ్రామంలో ఐదు బెల్టుషాపులున్నాయి. అక్కడ 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేది. చాలామంది మద్యానికి బానిసలయ్యారు. ఇటీవల ఓవ్యక్తి మద్యం తాగి చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఈనెల 6వ తేదీన గ్రామ సర్పంచ్‌ సహకారంతో గ్రామంలో బెల్టు షాపులను తొలగించాలని, మద్యం అమ్మినా, తాగినా జరిమానా విధించాలని తీర్మానం చేశారు. తీర్మానం తర్వాత ప్రస్తుతం ఆ పల్లె ప్రశాంతంగా ఉంది.

నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో మూడు వేల జనాభా ఉంది. ఆ ఊరిలో పది బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మేవారు. నెల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బిల్డింగ్‌పైన మద్యం తాగాడు. కిందకు దిగే క్రమంలో కిందపడి చనిపోయాడు. ఆగ్రహించిన మహిళలు గ్రామంలోని బెల్టుషాపులపై దాడులు చేసి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ గ్రామంలోనూ మద్యం అమ్మినా, తాగినా జరిమానా తప్పదంటూ తీర్మానం చేశారు.

● ఇదే మండలం చల్మెడలోనూ గల్లీకో బెల్ట్‌షాపు ఉండేది. ఇక్కడ కూడా మద్యం అమ్మినా, తాగి నా జరిమానా తప్పదంటూ తీర్మానించారు.

● మెదక్‌ జిల్లాలో 21 మండలాల పరిధిలో 469 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 49 వైన్స్‌లు, రెండు బార్లు కొనసాగుతున్నాయి.

● బెల్ట్‌షాపులు మాత్రం వెయ్యికిపైగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తాగునీరు దొరక్కపోవచ్చు కానీ, మద్యం మాత్రం అన్ని సమయాల్లో దొరుకుతుంది.

● ఫలితంగా ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. తాగుడుకు బానిసలైన వారు అర్థంతరంగా చనిపోవటం, ప్రశాంత పల్లెల్లో దొంగతనాలు, గొడవలు, పోలీసు కేసులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి.

● మద్యం అమ్మకాల టార్గెట్లు పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండటంతో సంబంధి శాఖ పరోక్షంగా బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

● మద్యానికి బానిసైన ఎంతో మంది అనారోగాలబారిన పడి చనిపోతున్నారు.

● ఈ తీవ్రతను గుర్తించిన జనం పల్లెలోని బెల్టుషాపులను తొలగిస్తున్నారు. ఊరంతా ఏకతాటిపైకి వచ్చి మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.

● ప్రజల డిమాండ్‌లకు తలొగ్గి గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సంపూర్ణ మద్యనిషేధ తీర్మానాలు చేస్తున్నాయి.

గతమంతా ప్రశాంతం

● గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేది. రైతులు, కూలీలు, వివిధ పనులు చేసుకునే వారు ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లేవారు.

● మందు తాగే అలవాటున్న వారు పని పూర్తయ్యాక సాయంత్రం మండల కేంద్రాల్లో గల వైన్‌న్‌షాపుల నుంచి మందు తెచ్చుకునే వారు. అదికూడా చాలా పరిమితం. చాలా మంది కల్లు మాత్రమే తాగేవారు.

● కానీ ఇపుడు పరిస్థితి గతంకంటే భిన్నంగా ఉంది. ప్రభుత్వం వైన్‌షాప్‌లకు టార్గెట్‌ విధించడంతో వాటి యజమానులు టార్గెట్‌ కోసం గ్రామాల్లో బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తున్నారు.

● దీంతో రెండు, మూడు నుంచి మొదలుకుని మేజర్‌ పంచాయతీల్లో డజన్‌కు పైగానే బెల్ట్‌షాపులు వెలిశాయి.

● మందు కోసం దూరంగా వెళ్లాల్సిన పనిలేకుండా రేయింబవళ్లు అందుబాటులో లభిస్తోంది.

● గల్లీకో బెల్ట్‌షాపు వెలియడంతోపాటు, సిట్టింగ్‌ కూడా ఏర్పాటు చేస్తుండటంతో గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.

● బెల్ట్‌ షాపుల కారణంగా కష్టపడి సంపాదించిందంతా తాగుడుకు వెచ్చిస్తున్నారు. తాగిన మైకంలో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

● కొందరు మద్యం మత్తులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు రోడ్లమీద గొడవ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల కారణంగా గ్రామీణ యువకులు, యూత్‌ అసోసియేషన్లు బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలు పెట్టారు.

మద్యం అమ్మకాలపై

మహిళల తిరుగుబాటు

అనర్థాలను గుర్తిస్తున్న

గ్రామీణ జనం

సంపూర్ణ మద్యనిషేధానికి

పంచాయతీల తీర్మానాలు

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top