విపత్తుల సమయంలో తక్షణమే స్పందించాలి
● 22న మాక్‌డ్రిల్ నిర్వహణ ● జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి సదీర్ బాల్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించి ప్రజారక్షణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి సదీర్ బాల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యతో రక్షణ చర్యల ప్రణాళిక రూపకల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజారక్షణపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో కనీసం పది రోజులు ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఈ నెల 22న అన్ని జిల్లాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించారు. చెన్నూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్, నీటిపారుదల, పశుసంవర్థక, పోలీస్, వ్యవసాయ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


