కుష్ఠువ్యాధి గుర్తింపు ఉద్యమం
మంచిర్యాలటౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లా వైద్యారోగ్యశాఖ ‘కుష్ఠువ్యాధి గుర్తింపు ఉద్యమం’ చేపట్టింది. జిల్లాలో 8,14,558 మంది జనాభా ఉండగా.. 2,12,500 ఇళ్లలో 650 బృందాల ద్వారా ఇంటింటి సర్వే చేస్తోంది. వ్యాధిగ్రస్తుల గుర్తింపు, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తారు. 2027వరకు కుష్ఠు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ నెల 18న ప్రారంభమైన సర్వే 31వరకు కొనసాగుతుంది. ఏటా వ్యాధి నిర్మూలనకు పలు కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల్లో పూర్తి అవగాహన రాకపోవడంతో నిర్మూలించలేకపోతున్నారు. 18న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ఆనంద నిలయం వృద్ధాశ్రమంలోని వృద్ధులను పరీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో రెండ్రోజులుగా సర్వే చేపడుతున్నారు.
బయటకు చెప్పుకోలేకనే...
జిల్లాలో కుష్ఠువ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గించేందుకు ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నా ఎక్కడో ఒకచోట వారిని గుర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి నివారణకు చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. వ్యాధిపై సరైన అవగాహన లేక, బయటకు చెబితే సామాజికంగా దూరమవుతామనే భయంతో బాధితులు అలాగే కాలం గడుపుతున్నారు. కుటుంబ సభ్యులు, సమీపంలో నివసించే వారికి ఈ వ్యాధి సోకడానికి కారకులు అవుతున్నారు.
జిల్లాలో వ్యాధిగ్రస్తుల వివరాలు
సంవత్సరం గుర్తింపు
2016–17 73
2017–18 37
2018–19 72
2019–20 54
2020–21 83
2021–22 74
2022–23 113
2023–24 87
2024–25 73
2025–26 74(నవంబర్ 30వరకు)
నిర్మూలనకు ఇంటింటి సర్వే
జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం ఇంటింటి సర్వే చేపట్టాం. వ్యాధిగ్రస్తులను గుర్తించడం, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ప్రతియేటా కుష్ఠువ్యాధి నివారణ కోసం సర్వేతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కొంతమేర నిర్మూలనకు ఉపయోగపడుతుంది. వ్యాధి పూర్తిస్థాయిలో లేకుండా చేయడమే ధ్యేయంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చర్యలు చేపడుతోంది.
– డాక్టర్ అనిత, జిల్లా వైద్య,
ఆరోగ్యశాఖ అధికారి


