సర్పంచ్ ఓట్ల లెక్కింపులో తేడాపై ఆందోళన
చెన్నూర్‌రూరల్: మండలంలోని బావురావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తేడా వచ్చిందంటూ ఓడిపోయిన అభ్యర్థి మద్దతుదారులు శుక్రవారం చెన్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు. అనంతరం చెన్నూర్–మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పబ్బ జ్యోతి స్వతంత్ర అభ్యర్థిగా, తాటి శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ మద్దతుదారుగా పోటీపడ్డారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా రెండు ఓట్ల తేడాతో శ్రీని వాస్‌గౌడ్ గెలిచినట్లు ప్రకటించారు. కాగా, జ్యోతి మద్దతుదారులు మాట్లాడుతూ గ్రామంలో 803 ఓట్లు ఉండగా.. 738 పోలైనట్లు అధికారులు చూపించారని అన్నారు. జ్యోతికి 355 ఓట్లు, శ్రీనివాస్‌కు 357 ఓట్లు వచ్చాయని, 15 ఓట్లు చెల్లలేదని, నోటాకు 8ఓట్లు వచ్చినట్లు చూపించారని తెలిపారు. మొత్తం 735 ఓట్లు వస్తున్నాయని, మిగతా మూడు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోలీసులు ధర్నా విరమింపజేశారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.


