మతిస్థిమితం లేని మహిళ మృతి
సారంగపూర్: నిర్మల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని అడ్డి రాజమణి (36) శుక్రవారం మండలంలోని ధని గ్రామంలో బావిలో పడి మృతి చెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధని గ్రామానికి చెందిన రాజమణిని నిర్మల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. రాజమణి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వీరి 14 ఏళ్ల కుమారుడు కూడా ఏడాది క్రితం చని పోయాడు. అప్పటినుంచి రాజమణి మతిస్థిమితం కోల్పోయింది. ధని గ్రామంలోని తన తల్లిగారి ఇంటివద్దే ఉంటోంది. నెలక్రితం ఆత్మహత్యకు యత్నించగా ఆమె సోదరులు అడ్డుకుని రక్షించారు. కాగా, గురువారం రాత్రి నుంచి ఆమె కనిపించడంలేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ధని గ్రామంలోని ఎస్సీ కాలనీ వెనుక వైపు గ్రామపంచాయతీకి చెందిన బావిలో పడి మృతి చెందింది. ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో వెళ్లి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


