పీఎస్ నుంచి సీనియర్ ఆడిటర్‌గా..
బోథ్: నిరంతర కృషి, పట్టుదల ఉంటే లక్ష్యాన్ని ముద్దాడొచ్చని తోషం గ్రామపంచాయతీ కార్యదర్శి పనుల పురుషోత్తం నిరూపించారు. ఇటీవల విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో ఆయన స్టేట్ లెవల్‌లో 172వ ర్యాంక్, జోనల్ స్థాయిలో 18వ ర్యాంక్ సాధించి సీనియర్ ఆడిటర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మండలంలోని ధన్నూర్ బీ గ్రామానికి చెందిన పురుషోత్తంకు 2014లోనే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం లభించింది. అప్పటి నుంచి బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నత ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యారు. అవసరమైనప్పుడు సెలవులు పెట్టి గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాగలకు సిద్ధమయ్యారు. గతంలో రెండుసార్లు స్వల్ప తేడాతో గ్రూప్–2 ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించి నేడు గ్రూప్–3లో సత్తా చాటారు. తన విజయానికి కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని పురుషోత్తం పేర్కొన్నారు. తల్లి ఊషమ్మ ఆశీస్సులు, భార్య విమల ప్రోత్సాహం తనను నిరంతరం ముందుకు నడిపించాయని తెలిపారు. ఆయనకు కుమారుడు శ్రేయాన్ష్, కుమార్తె క్రిశ్వి ఉన్నారు. గ్రూప్–3 సాధించడం సంతోషంగా ఉన్నా తన అసలు లక్ష్యం గ్రూప్–1 ఉద్యోగం సాధించడమేనని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించిన పురుషోత్తంను తోటి ఉద్యోగులు, గ్రామస్తులు అభినందించారు.


