ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మళ్లీ పరీక్షల్లో ఫెయిలవుతానేమోనని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని భగవంతంవాడలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ ప్రమోద్‌రావు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన చింతల శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు రాజేశ్, విఘ్నేశ్ (20) ఉన్నారు. వీరు మంచిర్యాలలోని భగవంతంవాడలోని శ్రీనివాస్ అత్తగారైన శంకరమ్మ ఇంట్లో ఐదేళ్లుగా ఉంటూ ఇక్కడే చదువుకుంటున్నారు. చిన్న కుమారుడు విఘ్నేశ్ ఐటీఐ చదువుతున్నాడు. గతేడాది రాసిన పరీక్షలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. ఈ నెల 24న మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలున్నాయి. ఈసారి నిర్వహించే సప్లమెంటరీ పరీక్షల్లోనూ ఫెయిలవుతానేమోనని కొద్దిరోజులుగా దిగులు పడుతున్నాడు. ఈ నెల 18న రాజేశ్, విఘ్నేశ్ రోజులాగే రాత్రి భోజనం చేశాక గదిలో నిద్రించారు. అందరూ నిద్రలోకి జారుకున్నాక విఘ్నేశ్ ఇంట్లోని హాల్‌లో స్లాబ్ కొండికి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటికి రాజేశ్ నిద్రలేచి చూడగా విఘ్నేశ్ కనిపించలేదు. హాల్‌లోకి వచ్చి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


