పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చెన్నూర్‌రూరల్: మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి అనుబంధ గ్రామమైన రాయిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గండు జగదీశ్, అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి వెంకటేశ్ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు. నారాయణపూర్‌కు చెందిన రాదండి చిన్న సమ్మయ్య వెంకటేశ్‌కు మద్దతుగా ప్రచారం చేశాడు. కానీ బుధవారం జరిగిన ఎన్నికల్లో వీళ్లిద్దరూ కాకుండా మూడో వ్యక్తి గెలుపొందడంతో తన ఓటమికి చిన్న సమ్మయ్య కారణమని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి జగదీశ్, అతడి కుటుంబ సభ్యులు చిన్న సమ్మయ్య ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన సమ్మయ్య గురువారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సమ్మయ్యను చెన్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమ్మయ్యను చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు.


