పుష్కర ఏర్పాట్లు చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: 2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని నదీ తీర ప్రాంతాల్లో భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర దేవాదాయ శాఖ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అధికారి నవీన్‌కుమార్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర అధికారులు పలు సూచనలు చేశారన్నారు. గోదావరి పుష్కరాలు–2027, కృష్ణా పుష్కరాలు–2028లను సురక్షితంగా, సవ్యంగా, భక్తులకు అనుకూలంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరాల ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతలను ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. దేవాదాయ శాఖకు అవసరమైన సమగ్ర వివరాలను అందిస్తామని, పుష్కర ఘాట్లపై క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే నిర్వహించామని తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌ను జిల్లా నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 11ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఉన్నాయని, భక్తుల సందర్శన సంఖ్య ఆధారంగా ఈ ఘాట్లను 3 టియర్స్‌గా విభజించినట్లు తెలిపారు. ఆయా ఘాట్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధిత శాఖల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


