● జిల్లాలో సంచారంపై ఫేక్ వీడియోలు.. ● సోషల్ మీడియాలో
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పెద్దపులుల సంచారం కన్నా, అసత్య ప్రచారాలతోనే జనం బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ఆధునికతతో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) క్రియేట్‌తో సోషల్ మీడియాలో పులుల సంచారం అంటూ వ్యాప్తి చేస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పులులు సంచరిస్తున్నది తెలిసిందే. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, జన్నారం డివిజన్లలో మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు స్థానిక అడవుల్లో, కొత్త ప్రాంతాల్లో కలియదిరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పెద్దపులుల సంచారంపై అప్రమత్తంగా ఉంటున్నారు. ఎటువైపు కదలికలు ఉన్నాయోనని పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు, పశువులపై దాడులు గమనిస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే చాలా చోట్ల పులుల సంచారం లేకున్నా, ఉన్నట్లుగానే ప్రచారం చేయడంతోనే స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
అసత్యపు ప్రచారంతో హడలెత్తిస్తూ...
ఇటీవల శ్రీరాంపూర్ పరిధిలో ఆర్కే 8 బొగ్గు గని సమీపంలో ఓ పులి రోడ్డుకు సమీపంలో అటుగా వెళ్తున్నవారికి కనిపించింది. ఆ సమయంలో తమ వాహనంలోనే ఉంటూ ఆ పులి కదలికలను వీడియో తీశారు. ఆ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. పులి సంచారంపై అధికారులు ధృవీకరించుకోగా నిర్ధారణ అయింది. అయితే దీనిని ఆసరా చేసుకొని కొందరు ఏఐతో ఆర్కే 5లో పులి సంచరిస్తున్నట్లు పెద్దపులితో ఉన్నట్లు ఫొటోలను సృష్టించి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అటవీ అధికారులు సైతం పులి వచ్చిందా? అని పలుచోట్ల పరిశీలించగా, వచ్చినట్లు ఎలాంటి గుర్తులు కనిపించలేదు. మరో వైపు రెండు రోజుల క్రితం ఇదే తీరుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ పులి రైలు పట్టాలపై చనిపోయింది. ఇది కూడా జిల్లా పరిధిలోనే మంచిర్యాల–పెద్దంపేట మధ్య రైల్వే పట్టాలపై ఓ పులి చనిపోయిందంటూ వాట్సాప్‌లో వైరల్ చేశారు. దీంతో మళ్లీ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెలలో జరిగిన ఘటనకు ఇక్కడ చనిపోయిందంటూ సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేశారు. అంతకుముందు మాదా రం, ఖైరీగూడ ఓసీపీ వద్ద పులి సంచరిస్తోందని ప్రచారం చేశారు. ఇవే కాకుండా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ఎవరికి తోచినట్లు వారు పులుల సంచారంపై అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఇకనైనా అసత్య ప్రచారాలు చేయొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
● జిల్లాలో సంచారంపై ఫేక్ వీడియోలు.. ● సోషల్ మీడియాలో


