ఫేక్ ఫొటో షేర్‌చేసిన యువకుడి గుర్తింపు
నస్పూర్: పులి సంచరిస్తుందంటూ సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్ కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో తరుచుగా వినిపిస్తున్న మాట. పలువురు ఆకతాయిలు ఎలాంటి అవగాహన, సరైన సమాచారం లేకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా బుధవారం రాత్రి సీసీసీ లోని పోస్ట్ ఆఫీస్ వద్ద పులి సంచరిస్తుందంటూ నకిలీ పులి ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అదే రాత్రి సీసీసీ, ఆర్‌కే 5 కాలనీ చుట్టు పక్కల బృందాలుగా ఏర్పడి డ్రోన్‌లతో గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. పులి సంచారం అవాస్తవం అని నిర్ధారించారు. గురువారం ఉదయం అటవీశాఖ అధికారులు ఆర్–కే 5 కాలనీలో విలేకరులతో మాట్లాడుతుండగా కాలనీ బ్యారెక్సుకు చెందిన జహినాబేగం తన ఇంటి సమీపంలోకి పులి వచ్చిందని, పులి చూసానని కాలనీవాసులకు సమాచారం ఇచ్చింది. కాలనీ వాసులు అక్కడే ఉన్న అటవీ శాఖ అధి కారులకు తెలుపడంతో ఎఫ్‌ఆర్వో రత్నాకర్, డీవైఎఫ్‌ఆర్వో అబ్దుల్ అజార్, ఇతర సిబ్బందితో కలిసి బ్యారె క్సు, మసీదు, చర్చి, డంపింగ్ యార్డు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో పులి సంచారం అవాస్తవమని, భయాందోళనలకు గురి కావొద్దని సదరు మహిళతో పాటు స్థానికులకు సూచించారు.
అసత్య ప్రచారాలు నమ్మొద్దు :
డీఎఫ్‌వో శివ్‌ఆశిష్ సింగ్
ఆర్‌కే–5 కాలనీలో డీఎఫ్‌వో శివ్ ఆశిష్‌సింగ్ ఎఫ్‌ఆర్లో రత్నాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని పలు కాలనీల్లో పులి సంచరిస్తుందంటూ వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. నకిలీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి అధికారులు, సిబ్బంది సమయాన్ని వృథా చేయడంతో పాటు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరైంది కాదన్నారు. సోషల్ మీడియాలో నకిలీపోస్ట్‌లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా సమాచారం కోసం 94403 13191, 94415 33220నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నకిలీ ఫొటో పోస్ట్‌చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఆర్లో అబ్దుల్‌అజార్, బీట్ ఆఫీసర్ రమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


