పల్లెల్లో మద్యం వరద
పంచాయతీ ఎన్నికల్లో ఏరులై పారిన వైనం
11రోజుల్లో రూ.35 కోట్ల విలువైన అమ్మకాలు
కొత్త వ్యాపారుల్లో జోష్
మంచిర్యాలక్రైం: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీలో లక్కు దక్కిన వ్యాపారులకు ఎన్నికల కిక్కు కలిసొచ్చింది. ప్రారంభంలో అమ్మకాలు సాధారణంగా జరిగిన, రోజురోజుకు అమ్మకాలు పెరిగాయి. ఈ నెల 6వ తేదీ నుంచి అమ్మకాలు ఊపందుకోగా 17వ తేదీ వరకు 11రోజుల్లో రూ.35 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో మందు జోరు..
జిల్లాలో 73 మద్యం దుకాణాలుండగా సాధారణ రోజుల్లో నిత్యం జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. గత నెల నవంబర్ 25న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది కానీ, ఈ నెల 6వ తేదీ నుంచి పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో మద్యం అమ్మకాలు జోరుగా సా గాయి. 11రోజుల్లో మద్యం అమ్మకాలు రూ.35కోట్లకు చేరాయి. మద్యం అమ్మకాల విషయంలో ఎకై ్సజ్ శాఖ ప్రతీ మద్యం దుకాణానికి టార్గెట్ పెడుతోంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎకై ్సజ్ శాఖ అధికారులు విధించినదానికంటే మూడింతలు ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెప్పడం గమనార్హం.
కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు...
కొత్త మద్యం వ్యాపారులకు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, వీటి తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త మద్యం వ్యాపారుల్లో అనందం కనిపిస్తోంది. కొత్త మద్యం పాలసీకి రెండు సంవత్సరాల గడువు ఉండగా మొదటి సంవత్సరం మొత్తం ఎన్నికల సందడిలో మద్యం అమ్మకాలు జోరుగానే సాగుతాయని అంచనా వేసుకుంటున్నారు.


