ప్రజల కోసం దేనికై నా రెడీ
రామకృష్ణాపూర్: కార్యకర్తలకు అండగా ఉండటానికి, ప్రజల కోసం నిలబడటానికి అవసరమైతే ఎంతటి పోరాటానికై నా వెనుకాడబోనని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఒకవేళ ఎస్సీ జనరల్ అయితే తాను జెడ్పీటీసీ ఎన్నికల్లో తప్పక పోటీచేస్తానని తెలిపారు. క్యాతనపల్లిలోని సుమన్ స్వగృహంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను గురువారం ఘనంగా సన్మానించారు. సుమన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, ప్రజాజీవితంలో వారి మద్దతు కూడగట్టుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయ న పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా కష్టపడి పనిచేసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలోనూ ఇదే స్ఫూర్తిని చాటి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కోల్‌బెల్ట్‌లో నెలకొన్న సమస్యలపై జీఎం కార్యాలయాల ముట్టడికి టీబీ జీకేఎస్ నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాజరమేశ్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, బడికల సంపత్, రామడికుమార్ పాల్గొన్నారు.


