రిటైర్డు ఉద్యోగులకేది బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

రిటైర్డు ఉద్యోగులకేది బోనస్‌

Dec 18 2025 7:37 AM | Updated on Dec 18 2025 7:37 AM

రిటైర్డు ఉద్యోగులకేది బోనస్‌

రిటైర్డు ఉద్యోగులకేది బోనస్‌

● లాభాల వాటా, దీపావళి బోనస్‌ కోసం ఎదురుచూపులు ● ప్రతీసారి జాప్యమే..!

శ్రీరాంపూర్‌: సింగరేణిలో రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వారికి ప్రతీ ఆర్థికపరమైన చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారు. ప్రతీసారి బోనస్‌ సమయంలో రిటైర్డ్‌ ఉద్యోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్‌రోల్‌ ఉద్యోగులకు లాభాల వాటా, దీపావళి బోనస్‌ డబ్బులు చెల్లించి మూడు నెలలు గడుస్తున్నా రిటైర్డ్‌ ఉద్యోగులకు బోనస్‌ డబ్బులు అందలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన లాభాల నుంచి వాటా చెల్లించారు. ఏప్రిల్‌ 1, 2024 నుంచి మార్చి 31, 2025 నాటికి 100 మస్టర్లు చేసిన వారు ఈ లాభాల బోనస్‌కు అర్హత సాధిస్తారు. దీంతోపాటు జనవరి 1, 2024 నుంచి డిసెంబర్‌ 31, 2024 వరకు పని చేసిన వారికి దీపావళి బోనస్‌(పీఎల్‌ఆర్‌) చెల్లించారు. ఇందుకు 30 మస్టర్లు చేసి ఉంటే అర్హులు. ఆగస్టు 31, 2025కి ముందు రిటైర్డ్‌ అయిన వారికి లాభాల వాటా, సెప్టెంబర్‌ 30, 2025కి ముందు రిటైర్డ్‌ అయిన వారికి దీపావళి బోనస్‌ చెల్లించలేదు. ఈ నిర్ణీత తేదీల్లో పని చేసి, నిర్ణీత మస్టర్లు చేసి ఉంటే ఈ బోనస్‌కు అర్హులుగా ఉంటారు. ఇలా శ్రీరాంపూర్‌లో లాభాల వాటా కోసం 350 మంది, దీపావళి బోనస్‌ కోసం 600 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

ఆడిట్‌ పేరిట జాప్యం

కంపెనీలో అన్నింటికీ కంప్యూటర్‌ ఆన్‌లైన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అయినా రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆర్థికపరమైన చెల్లింపులకు వచ్చే సరికి ఏవేవో కొర్రీలు పెడుతూ జాప్యం చేస్తున్నారు. ఆడిట్‌ చేస్తున్నామంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఉద్యోగుల హాజరు శాతం మొదలుకొని వేతనాలు అన్ని కూడా కంప్యూటర్‌ సాప్‌ ప్రోగ్రాంలో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని క్రోడీకరించి ఎంత మొత్తం చెల్లించాలో లెక్కలు తీయడానికి అధికారులు నెలల సమయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. రిటైర్డ్‌ అయిన వారికి బోనస్‌ డబ్బులు చెల్లించాలంటే వారు కంపెనీకి ఉన్న బకాయిలు చూడాలని, పీనల్‌ రెంట్‌లు, ఫెస్టివల్‌ అడ్వాన్స్‌లు, ఆడిట్‌ రివకరీలు, మెడికల్‌ బిల్లులు, నామినీ వివరాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలు వారు సమర్పిస్తే పూర్తి స్థాయిలో ప్రాసెస్‌ చేసిన తరువాతే చెల్లించడం వీలవుతుందని, ఆన్‌రోల్‌ కార్మికులతోపాటుగా వెంటనే చెల్లిండం వీలుకాదని పర్సనల్‌ డిపార్టుమెంట్‌ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వీరికి చెల్లింపు కోసం తాజాగా కార్పొరేట్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని, ప్రాసెస్‌ చేసి మరో 20 రోజుల్లో చెల్లించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement