ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వాదం
ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, స్థానిక పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ మధ్య బుధవారం వా గ్వాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలంలోని రాజంపేట పోలింగ్ కేంద్రానికి సమీపంలో గల ఎమ్మెల్యే నివాసం వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు గుమిగూడారు. గమనించిన సీఐ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి గమనించిన ఎమ్మెల్యే వెంటనే ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉన్నవారిని హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోవాలని, లేనిపక్షంలో రోడ్డుపై బైఠాయిస్తానని హెచ్చరించారు. దీంతో సీఐ సిబ్బందితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉదయం ఫ్లెక్సీ రగడ
రాజంపేటలోని పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం వద్ద పార్టీ నాయకులతో కూడిన ఫ్లెక్సీలతో తొలగించే క్రమంలో ఉదయం 9.30 గంటలకు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీవో లోకేశ్వర్‌రావు ఆధ్వర్యంలో అధికారులు ఫ్లెక్సీలు తొలగించేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు తొలగించిన తర్వాతే తమవి తొలగించాలని పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి ఇన్నిరోజులైనా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. చివరికి కార్యకర్తలు ఫ్లెక్సీల తొలగింపునకు అంగీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది.


