బైక్ కొనివ్వలేదని బలవన్మరణం
ఖానాపూర్: ఏడాది కాలంగా తనకు బైక్ కొనివ్వాలని అడుగుతున్నా.. తండ్రి ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నాడని మనస్తాపం చెందిన యువకుడు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖానాపూర్ మండలం కొమ్ముతండాలో జరిగింది. చేతికి వచ్చిన కొడుకు చేదోడుగా ఉంటాడనుకుంటే.. బలమన్మణానికి పాల్పడడంతో తండ్రి గుండెలో పగిలేలా రోదిస్తున్నాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్నంది పంచాయతీ పరిధిలోని కొమ్ముతండాకు చెందిన భూక్య బలిరాంకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు భూక్య వెంకటేశ్(21) ఉన్నాడు. పెద్ద కూతురుకు వివాహం చేశాడు. ఐదేళ్ల క్రితం బలిరాం భార్య చనిపోయింది. ఇక ఒక్కగానొక్క కొడుకు కావడంతో వెంకటేశ్‌ను గారాబంగా పెంచారు. దీంతో చదవుకూడా పెద్దగా అబ్బలేదు. దీంతో ఐదేళ్లుగా తండ్రికి తోడుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాది కాలంగా వెంకటేశ్ తనకు బైక్ కొని ఇవ్వాలని తండ్రి బలిరాంను కోరుతున్నాడు. పెద్ద కూతురు పెళ్లి చేయడం కారణంగా వాయిదా వేశాడు. ఈ ఏడాది వానాకాలం పంట దిగుబడి కూడా ఆశించిన మేరకు రాలేదు. అయినా వెంకటేశ్ మంగళవారం తనకు బైక్ కావాలని కోరాడు. తండ్రి యాసంగి పంట తర్వాత కొనిస్తానని చెప్పాడు. తరచూ వాయిదా వేస్తున్నాడని మనస్తాపం చెందిన వెంటకేశ్ పొలం వద్దకు వెళ్లి.. పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మరణంతో బలిరాం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


