పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/దండేపల్లి/జన్నారం: పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో పోలింగ్ సిబ్బంది నిబద్దతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్‌తోపాటు జిల్లా సాధారణ ఎన్నికల పర్యవేక్షకులు మనోహర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య హాజీపూర్, దండేపల్లి, జన్నారం మండల కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ పోలింగ్ నిర్ణీత సమయంలో ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు.
గైర్హాజరు సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దండేపల్లిలో కొందరు సిబ్బంది హాజరు కాలేదని అధికారులు చెప్పడంతో వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రిజర్వు సిబ్బందిని వెంటనే పోలింగ్ కేంద్రాలకు పంపాలని సూచించారు. జన్నారంలో సిబ్బంది ఆలస్యం రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్లు రోహిత్ దేశ్‌పాండే, రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవోలు ప్రసాద్, ఉమర్‌షరీఫ్, ఎంఈవో విజయ్‌కుమార్, పశువైద్యాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


