విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
తాండూర్/నెన్నెల: విధి నిర్వహణలో వైద్యాధికారులు, సిబ్బంది ఏమాత్రం అలసత్వం ప్రదర్శించొద్దని డీఎంఅండ్‌హెచ్‌ఓ అనిత సూచించారు. బుధవారం తాండూర్, నెన్నెల మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసేవలపై వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉదయం పోలింగ్ నుంచి ఫలితాలు వెలువడే వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందికి ప్రథమ చికిత్స కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు ఝాన్సీ, అధికారులు ప్రశాంతి, వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ సుశీల పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
వేమనపల్లి: జాతీయ ఆరోగ్యమిషన్ ఉద్యోగులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డీఎంహెచ్‌ఓ అనితకు వినతిపత్రం అందజేశారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్తామని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాపుయాదవ్, ఉద్యోగులు, సిబ్బంది తెలిపారు.
ఎక్స్‌రే మిషన్ మంజూరు
మంచిర్యాలటౌన్: క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు కోసం ఫోర్‌టేబుల్ ఎక్స్‌రేమిషన్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత అన్నారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఎక్స్‌రే మిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్, విశ్వేశ్వర్‌రెడ్డి, రమేష్, సురేందర్, పద్మ, ప్రశాంతి, సుమన్, సంతోష్, బుక్కా వెంకటేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.


