 
															బ్యాంకులో చోరీకి యత్నం
రెబ్బెన: మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ తెలంగాణ గ్రామీణ బ్యాంకు భవనం కిటికీ ఊచలు తొలగించి అద్దాలు పగలగొట్టి బ్యాంకు లోపలికి ప్రవేశించాడు. డబ్బుల కోసం క్యాషియర్ క్యాబిన్‌లో, అకౌంటెంట్ టేబుల్ వద్ద డ్రాలో వెతికాడు. డబ్బులు దొరక్కపోవడంతో బ్యాంకు మేనేజర్ గదిలోకి వెళ్లి సీసీ కెమెరాల వైర్లు తొలగించి బ్యాంకు లాకర్ తాళాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. వెంటనే బ్యాంకులో ఉన్న సెక్యూరిటీ అలారంతో పాటు బ్యాంకు మేనేజర్ సెల్‌ఫోన్‌లో సెక్యూరిటీ అలారం మోగింది. అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ దేవరకొండ శ్రీకాంత్ క్యాషియర్ ప్రసాద్‌కు ఫోన్ చేసి బ్యాంకు వద్దకు వెళ్లాలని సూచించాడు. హుటాహుటిన క్యాషియర్ బ్యాంకు వద్దకు చేరుకోగా అదే సమయంలో కిటికీ నుంచి దొంగ పరారయ్యాడు. వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ చిత్తరంజన్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకుని దొంగ బ్యాంకు లోపలికి ప్రవేశించిన తీరు, చోరీకి యత్నించిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డ్వాగ్ స్క్వాడ్‌ను పిలిపించి దొంగ వేలిముద్రలు, ఇతర ఆధారాలు సే కరించారు. దొంగను పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంక్ లాకర్ తెరుచుకోకపోవడంతో నగదు, బంగారం చోరీకి గురికాలేదని, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుధవారం తెలిపారు.
 
							బ్యాంకులో చోరీకి యత్నం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
