
హోరాహోరీగా బాలికల ఫుట్‌బాల్ పోటీలు
● సెమీస్‌కు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జట్లు
రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఉదయం లీగ్ కమ్ నాకౌట్ పోటీలు నిర్వహించారు. మధ్యాహ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగాయి. మహబూబ్‌నగర్–నల్గొండ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండు జట్లు దీటుగా తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌లు నిర్వహించారు. ఇందులో నల్గొండ జట్టు 2–1 తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలిచి సెమీస్‌కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో వనపర్తి–ఖమ్మం జట్లు తలపడగా 0–1 తేడాతో ఖమ్మం గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో నిజామాబాద్–గద్వాల్ జట్లు తలపడగా 7–1 గోల్స్‌తో నిజామాబాద్ గెలుపొందింది. ఇక ఆతిథ్య ఆదిలాబాద్ జట్టుకు క్వార్టర్ ఫైనల్స్‌లో నిరాశే ఎదురైంది. రంగారెడ్డి–ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 4–0 గోల్స్‌తో రంగారెడ్డి గెలిచి సెమీస్‌కు చేరింది. శుక్రవారం ఉదయం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నల్గొండ–నిజామాబాద్‌ల మధ్య, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఖమ్మం–రంగారెడ్డి జట్ల మధ్య జరుగనుంది.