
వాగు దాటితేనే వైద్యం
● అర్ధరాత్రి అస్వస్థతకు గురైన చిన్నారి ● ప్రాణాలకు తెగించి వరదదాటి ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ● వంతెన నిర్మించాలని గ్రామస్తుల వేడుకోలు
ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాగులు, ఒర్రెలపై వంతెనలు లేకపోవడంతో ఆదివాసీలకు రాకపోకలు కష్టంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తిన అత్యవసర సమయాల్లో ప్రాణాలు పణంగా పెట్టి వరద దాటితేనే వైద్యం అందుతోంది. ఇంద్రవెల్లి మండలం మండలంలోని మామిడిగూడ(బి), మామిడిగూడ(జి) గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన లేదు. మామిడిగూడ(బి) గ్రామానికి చెందిన ఉయిక స్వప్న, గోవింగ్‌రావ్ దంపతుల కుమార్తె సోమవారం రాత్రి కడుపు నొప్పితో బాధపడింది. కుటుంబ సభ్యులు రాత్రిపూట చిమ్మచీకటిలోనే ఓ చిన్నలైటు, గ్రామస్తుల సాయంతో వాగు దాటారు. ఆటో సాయంతో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చిన్నారికి చికిత్స అందించారు. తమ గ్రామానికి పక్కా రోడ్డు, వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ప్రారంభంకాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ప్రాణాలకు తెగించి వరద నీటితో సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా వంతెన, రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.