
● గత నెల 2న మంజూరు కావాల్సిన చెక్కులు ● నెలదాటినా కొలిక
మంచిర్యాలటౌన్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం జరుగుతోంది. అర్హుల ఎంపిక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో దరఖాస్తుదారులు ఎదురుచూడాల్సి వస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నాలుగు కేటగిరీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు రుణాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. కేటగిరీ–1 రూ.50వేలలోపు, కేటగిరీ–2 రూ.50 వేల నుంచి రూ.లక్ష, కేటగిరీ–3 రూ.లక్ష నుంచి రూ.2లక్షలు, కేటగిరీ–4 రూ.లక్షల నుంచి రూ.4లక్షలు రుణం అందించేందుకు విభజించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అర్హులకు చెక్కులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందించలేకపోయింది. అర్హులు ఎవరనేదే ఇప్పటి వరకు తేల్చలేదు. మొదటగా రూ.50వేలు, రూ.లక్ష రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు అందించాలని నిర్ణయించింది. దరఖాస్తుదారుల్లో కేటగిరీ–3, 4లకు చెందిన వారే ఎక్కువగా ఉండడంతో ఆయా కేటగిరీల్లోని వారు కొందరు మొదటి రెండు కేటగిరీలకు మార్పులు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా కేటగిరీ–1, 2లకు సైతం రుణాలు ఇవ్వకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. కనీసం అర్హులు ఎంతమంది అనేది తేల్చకపోవడంతో ఎవరికి రుణం వస్తుందో రాదోననే ఆందోళన కనిపిస్తోంది.
యూనిట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
రాజీవ్ యువ వికాసం కోసం మార్చి 17నుంచి ఏప్రిల్ 14వరకు దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్‌కు 30,741 దరఖాస్తులు రాగా, 4,605 యూనిట్లు మాత్రమే కేటాయించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 17,596 మంది దరఖాస్తు చేసుకోగా 5,341 యూనిట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు 4,199 దరఖాస్తులకు గాను 1,644 యూనిట్లు, మైనారిటీ కార్పొరేషన్‌కు 3,331 దరఖాస్తులకు 450 యూని ట్లు, క్రిస్టియన్ మైనారిటీస్ 141 దరఖాస్తులకు యూనిట్లు 89 ఉన్నాయి. యూనిట్లు తక్కువగా ఉండి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పరిశీ లన పూర్తి కాలేదు. బ్యాంకర్ల నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు జాబితా చేరాల్సి ఉండగా.. మండల స్థాయి కమిటీలు తుది జాబితా సిద్ధం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మండల స్థాయిలో ఎంపిక చేసిన జాబితాను జిల్లా స్థాయికి అక్కడ బడ్జెట్ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హులకు చెక్కులు అందించాల్సి ఉన్నా ఇప్పటికీ అర్హులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. 3, 4 కేటగిరీల్లోని వారు మొదటి రెండు కేటగిరీలకు మార్చుకోవడం వల్ల రూ.50 వేలలోపు, రూ.లక్షలోపు యూనిట్లలో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో కేటగిరీలను మార్చేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఎడిట్ ఆప్షన్‌ను ఇవ్వడంతో అధికారులపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. కేటగిరీ–3, 4లో దరఖాస్తుదారులు కొందరు కేటగిరీ–1, 2లోకి మార్చుకోవడంతో మొదటగా దరఖాస్తు చేసుకున్న వారికి రుణం వస్తుందో రాదోననే భయం నెలకొంది.
కార్పొరేషన్ల వారీగా దరఖాస్తులు, యూనిట్లుకార్పొరేషన్ దరఖాస్తులు యూనిట్లు బీసీ 30,741 4,605ఎస్సీ 17,596 5,341
ఎస్టీ 4,199 1,644
మైనారిటీ 3,331 450
క్రిస్టియన్ 141 89
ఆలస్యం చేయొద్దు
రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా టెంట్‌హౌజ్ ఏర్పాటుకు రూ.4 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. రుణం వస్తే టెంట్‌హౌజ్, డెకరేషన్ ఏర్పాటు చేసుకుందామని ఎదురు చూస్తున్నా. రుణం వస్తేనే నాకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా అర్హులైన వారికి యువవికాసం రుణాలు అందిస్తే బాగుంటుంది.
– కన్నె శ్రీనివాస్, సింగాపూర్, నస్పూర్