
అభివృద్ధి పనులు పరిశీలించిన రైల్వే జీఎం
బెల్లంపల్లి/మంచిర్యాలఅర్బన్: బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ సోమవారం పరిశీలించారు. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి ప్రత్యేక రైలులో ఉదయం 10.15గంటలకు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేశారు. రైల్వే ఆర్వో షెడ్డు వద్ద పనులు పరిశీలించి రోజువారీ నివేదికపై అడిగి తెలుసుకున్నారు. మూడో లైన్ రైల్వేట్రాక్ పనులు పరిశీలించి సూచనలు చేశారు. మూడో ప్లాట్‌ఫాం నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని పేర్కొన్నారు. మంచిర్యాలలో వాహనాల పార్కింగ్, విశ్రాంతిగదులు, ఇతర పనులు పరిశీలించారు.
రైళ్ల హాల్టింగ్ కోసం వినతి
బెల్లంపల్లిలో పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఇన్‌చార్జి జీఎం సందీప్ మాథూర్‌కు సీపీఐ జిల్లా నాయకుడు చిప్ప నర్సయ్య, పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, సహాయ కార్యదర్శి తిలక్ అంబేడ్కర్, రత్నం రాజం తదితరులు వినతిపత్రం అందజేశారు. నవ జీవన్ ఎక్స్‌ప్రెస్ ఆపాలని, జీటీ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ సౌకర్యం పునరుద్ధరించాలని, కాల్‌టెక్స్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిఇకి రెండువైపుల మెట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
వందేభారత్ రైలు ఆపాలి
వందేభారత్ రైలు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో ఆపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, పలు విద్యార్థి సంఘాల నాయకులు వేర్వేరుగా ఇన్‌చార్జి జీఎంకు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల, ఆసిఫాభాద్ జిల్లాల భక్తుల సౌకర్యార్థం తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని, ఏపీ ఎక్స్‌ప్రెస్, కేరళ ఎక్స్‌ప్రెస్, సంఘమిత్ర, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంచిర్యాలలో నిలుపుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు మల్లారెడ్డి, పురుషోత్తం జాజు, సతీష్‌రావు, ఆంజనేయులు, అశోక్‌వర్థన్, జోగుల శ్రీదేవి, రాజన్న, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జాతీయ విద్యార్థిసమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు పరిశీలించిన రైల్వే జీఎం